రబీ సీజన్‌లో నిర్దేశించిన పంట రుణ లక్ష్యం సాధనలో బ్యాంకర్లు వెనుకబడటంపై కలెక్టర్ బి.శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీ సీజన్‌లో నిర్దేశించిన పంట రుణ లక్ష్యం సాధనలో బ్యాంకర్లు వెనుకబడటంపై కలెక్టర్ బి.శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. రుణాల మంజూరుపై సమీక్షిస్తూ రబీ సీజన్‌లో రుణ లక్ష్యం రూ.268.55 కోట్లకు గాను ఇప్పటివరకు కేవలం రూ.161.99కోట్లు మాత్రమే మంజూరు చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ వందశాతం రుణాలివ్వాలన్నారు. రుణ పురోగతిలో వెనుకబడిఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకు, ఎస్‌బీహెచ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులను వివరణ కోరగా.. రికవరీ లేకపోవడంతో రుణ మంజూరులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.
దీంతో కలెక్టర్ స్పందిస్తూ మండల స్థాయిలో రికవరీ క మిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వికారాబాద్, పరిగి, గండేడ్, దోమ మండలాల్లో రుణ మం జూరు అతి తక్కువగా ఉందన్నారు. స్వయం ఉపాధి యూనిట్లకు సంబంధించి లబ్ధిదారులతో వెంటనే ఖాతాలు తెరిపించి రుణాలు మంజూ రు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, జేడీఏ విజయ్‌కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.