
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. రేపటి నుంచి కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఆర్థిక మార్పులు అమల్లోకి వస్తాయి. ప్రధానంగా కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రెగ్యులేటరీ అప్‌డేట్‌లు, పన్ను సంస్కరణలు, విధాన మార్పులతోపాటు ఇటీవల ప్రభుత్వ అధికారులు తెలిపిన కొన్ని విభాగాల్లో మార్పులు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి కింద తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను సంస్కరణలు
కొత్త పన్ను శ్లాబులు, మినహాయింపులు
వార్షికంగా రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులను కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇది గతంలో రూ.7 లక్షల పరిమితి నుంచి భారీగా పెరిగింది. వేతన ఉద్యోగులు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ నుంచి ప్రయోజనం పొందుతారు. దాంతో పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.12.75 లక్షలకు చేరింది.
సెక్షన్ 87ఎ కింద పన్ను మినహాయింపు రూ .25,000 నుంచి రూ.60,000కు పెరుగుతుంది. ఇది రూ.12 లక్షల పన్ను రహిత పరిమితికి మద్దతుగా నిలుస్తుంది. అయితే ప్రత్యేక పన్ను రేట్లు (ఉదా.మూలధన లాభాలు) ఉన్న ఆస్తుల నుంచి వచ్చే ఆదాయానికి ఇది వర్తించదు.
అధిక టీడీఎస్/ టీసీఎస్ పరిమితులు
డిపాజిట్లపై వడ్డీ: సాధారణ పౌరులకు రూ.50,000 (గతంలో రూ.40,000), సీనియర్ సిటిజన్లకు రూ.లక్ష (గతంలో రూ.50,000) వరకు వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను మినహాయింపు లేదు.
టీడీఎస్ మినహాయింపును నెలకు రూ.20,000 (వార్షికంగా రూ.2.4 లక్షలు) నుంచి రూ.50,000 (వార్షికంగా రూ.6 లక్షలు)కు పెంచారు.
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఆర్ఎస్ కింద విదేశీ రెమిటెన్స్‌లపై టీడీఎస్ రూ .7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఇది చిన్న లావాదేవీలకు పన్ను భారాన్ని తగ్గిస్తుంది.
ఐటీఆర్-యూ గడువు: అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్-యూ) దాఖలు చేయడానికి విండో సంబంధిత మదింపు సంవత్సరం చివరి నుంచి 48 నెలల వరకు ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు గత ఫైలింగ్‌లను సరిదిద్దడానికి మరింత వెసులుబాటును ఇస్తుంది.
పెన్షన్, రిటైర్మెంట్
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్): ఏప్రిల్ 1, 2025 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని యూపీఎస్ భర్తీ చేస్తుంది.
25 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల్లో వారి సగటు మూల వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు. ఇది సుమారు 23 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
డిజిటల్ పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్
యూపీఐ నిబంధనలు: మోసాలను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లతో లింక్ అయి ఉన్న యూపీఐ ఐడీలను (12 నెలలు ఉపయోగించనివి) డీయాక్టివేట్ చేయాలని ఆదేశించింది. మార్చి 31, 2025లోగా బ్యాంక్ రిజిస్టర్డ్ నెంబర్లను అప్డేట్ చేసుకోవాలి. యూపీఐ లైట్ వినియోగదారులు మెరుగైన భద్రత కోసం తప్పనిసరి పిన్, పాస్ కోడ్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో వాలెట్ అమౌంట్‌ను తిరిగి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చు.
మినిమమ్ బ్యాలెన్స్
ఎన్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు ఏప్రిల్ 1, 2025 నుంచి సేవింగ్స్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.
ఏటీఎం ఛార్జీలు
నాన్ ఫైనాన్షియల్ ఏటీఎం లావాదేవీలకు (ఉదా.బ్యాలెన్స్ తనిఖీలు, మినీ స్టేట్‌మెంట్లు) రుసుము రూ.6 నుంచి రూ.7 వరకు పెరగవచ్చు. బ్యాంకు విధానాలు, ఉచిత లావాదేవీల పరిమితులను బట్టి నగదు ఉపసంహరణ ఛార్జీలు రూ.2 వరకు పెరిగే అవకాశం ఉంది.
యులిప్‌లపై మూలధన లాభాలు
వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) నుంచి ఉపసంహరణలు బడ్జెట్ 2025 ప్రతిపాదనలకు అనుగుణంగా మూలధన లాభాల్లోకి వస్తాయి.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)
హోటల్ రెస్టారెంట్ సేవలు: రోజుకు రూ.7,500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ ఉన్న హోటళ్లలోని రెస్టారెంట్లు 18% జీఎస్టీ (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌తో కలిపి) పరిధిలోకి వస్తాయి. ఇది లగ్జరీ ఆతిథ్య ఖర్చులను ప్రభావితం చేస్తుంది.
ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD) సిస్టమ్: రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాన్ని పంపిణీ చేయడానికి ఐఎస్‌డీ వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయడం, జీఎస్‌టీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు
ఆటోమొబైల్ ధరలు
మారుతీ సుజుకి (4% వరకు), హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా (2-4%) వంటి కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి కొనుగోలుదారులను ప్రభావితం చేస్తుంది.