
ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా రాబోయే నెలల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) వాటాల విక్రయం విషయంపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రణాళికాబద్ధమైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్-లిస్టెడ్ కంపెనీల్లో వాటా విక్రయం)ను ఒకటి నుంచి రెండు నెలలు వాయిదా వేయవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. అయితే చాలా కంపెనీల షేర్లు 2024 నమోదైన గరిష్ట స్థాయులతో పోలిస్తే 30 శాతం నుంచి 60 శాతం వరకు క్షీణించాయి. ప్రస్తుతం యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కొంత వాటాను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంస్థాగత వాటా విక్రయ ప్రక్రియ ద్వారా రూ.1,436 కోట్లు సమీకరించగా, మిగిలిన మూడు బ్యాంకుల్లో వాటా విక్రయాలకు సిద్ధంగా ఉంది. మార్కెట్ ఒడిదొడుకుల నేపథ్యంలో అందుకు మరో రెండు నెలల వరకు సమయం పట్టవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: భారత ఆర్థిక వ్యవస్థ భేష్
డివిడెండ్ల రూపంలో రూ.1.4 లక్షల కోట్లు
వాటాల అమ్మకాలు మందగించినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఎస్‌ఈ డివిడెండ్ల నుంచి గణనీయమైన రాబడిని సమకూర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీపీఎస్ఈలు 2025 మార్చి 31 నాటికి మేజర్ వాటాదారుగా ఉన్న ప్రభుత్వంతోపాటు ఇతర పెట్టుబడిదారులకు సుమారు రూ.1.40 లక్షల కోట్ల విలువైన డివిడెండ్లను పంపిణీ చేస్తాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వానికి సీపీఎస్ఈల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.70,000 కోట్లు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.9,300 కోట్లు సమకూరినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.