
నేడు(23న) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 10 పాయింట్లు తక్కువగా 11,167 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,177 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. తిరిగి టెక్నాలజీ దిగ్గజాలకు డిమాండ్ పెరగడంతో నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం యూఎస్ మార్కెట్లు 0.5-1.7 శాతం మధ్య ఎగశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. గురువారం సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనున్న కారణంగా దేశీ మార్కెట్లు నేడు మరోసారి ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
38,000 దిగువకు
రెండో రోజూ మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 292 పాయింట్లు క్షీణించి 37,742 వద్ద ముగిసింది. వెరసి 38,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11,154 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,210- 37,531 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,302- 11,085 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,058 పాయింట్ల వద్ద, తదుపరి 10,963 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,276 పాయింట్ల వద్ద, ఆపై 11,398 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 20,907 పాయింట్ల వద్ద, తదుపరి 20,675 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,422 పాయింట్ల వద్ద, తదుపరి 21,705 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,073 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 879 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment