
దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు జారీ చేసే క్రెడిట్ కార్డుల వృద్ధి ఫిబ్రవరిలో మందగించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో సహా ప్రముఖ ఆర్థిక సంస్థలు కొత్తగా జారీ చేసే కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి ఇతర ప్రముఖ బ్యాంకులు కూడా తమ క్రెడిట్ కార్డుల జారీ తగ్గిపోయిందని ఆర్‌బీఐ తెలిపింది.
భారతదేశ క్రెడిట్ కార్డ్ విభాగంలో అధికంగా వినియోగదారులున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిబ్రవరిలో 1,78,000 కార్డులను జోడించింది. దాంతో మొత్తం కార్డుల సంఖ్య 23.6 మిలియన్ల(2.36 కోట్లు)కు చేరంది. ఇది దేశంలో అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీదారుగా తన స్థానాన్ని సుస్థిరం చేసినప్పటికీ, వృద్ధి గత నెలతో పోలిస్తే క్షీణించింది. జనవరిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3,00,000 కొత్త కార్డులను జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన కార్డుల కంటే జనవరిలో ఇష్యూ చేసిన కార్డులు చాలా ఎక్కువ. ఎస్‌బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కూడా ఫిబ్రవరిలో మందకొడిగానే కార్డులను జారీ చేశాయి. ఆర్‌బీఐ డేటాలో సదరు బ్యాంకుల నెలవారీ కార్డుల చేర్పులకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు వివరించనప్పటికీ రెండు సంస్థలు గతంలో కంటే తక్కువ కార్డులనే జోడించాయని పేర్కొంది.
ఇదీ చదవండి: కొత్త లోన్ రూల్.. రేపటి నుంచే..
కార్డుల జారీ మందగించడానికి కారణాలు..
దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులతో సహా అన్‌సెక్యూర్డ్ రుణాలు పెరుగుతుండడంపై ఆర్‌బీఐ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. ఇది బ్యాంకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు కారణమైంది. దాంతో కార్డుల సంఖ్య తగ్గిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అధిక ప్రొవిజనింగ్ అవసరాలు లేదా కఠినమైన నో-యువర్-కస్టమర్ (కేవైసీ) నిబంధనలు వంటి నియంత్రణ చర్యలు కూడా కార్డుల జారీని ప్రభావితం చేసిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, విచక్షణా వ్యయం(డిసిక్రీషనరీ స్పెండింగ్)లో మందగమనం వంటి ఆర్థిక ప్రతికూలతలు కూడా కార్డుల వినియోగాన్ని తగ్గిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.