ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి సోమవారంతో ఆరు నెలలు కావస్తోంది.
* ఆరు నెలల నుంచీ కేంద్రం పరిశీలనలోనే 25 అంశాలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి సోమవారంతో ఆరు నెలలు కావస్తోంది. విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చిన హామీల్లో కేవలం రెండింటిలోనే కదలిక రాగా.. మిగతా 25 అంశాలూ ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వ ‘పరిశీలనలో’నే ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీల్లో.. ఒక్కటి కూడా ఈ ఆరు నెలల్లో నెరవేరలేదు.
అలాగే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల్లో కూడా ఇప్పటి వరకు రెండు హామీలను మాత్రమే కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలో ఎయిమ్స్‌కు మాత్రం అనుమతిస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు నివేదిక రూపకల్పనకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకును ఏజెన్సీగా నియమించింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడే రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. కానీ.. ఈ అంశంపై ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఎటువంటి ఆశాజనకమైన ప్రకటనా వెలువడలేదు.