పోలీసు శాఖలో సాగుతున్న విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని సీనియర్ పోలీసు అధికారులను రాష్ట్ర గవర్నర్ సలహాదారుడు ఎఎన్ రాయ్ కోరారు.
హైదరాబాద్: పోలీసు శాఖలో సాగుతున్న విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని సీనియర్ పోలీసు అధికారులను రాష్ట్ర గవర్నర్ సలహాదారుడు ఎ ఎన్ రాయ్ కోరారు. శుక్రవారం ఆయనసచివాలయంలోని డి బ్లాక్‌లో రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి టిపి దాస్, డీజీపీ బి.ప్రసాదరావు, గ్రేహౌండ్స్ డీజీపీ జె.వి.రాముడు, ఇంటెలిజెన్స్ అదనపు డిజి ఎం.మహేందర్‌రెడ్డి, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ విఎస్‌కె కౌముది,సిఐడి అదనపు డీజీ కృష్ణప్రసాద్ తదితర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఇప్పటి వరకు పోలీసు శాఖలో రెండు రాష్ట్రాలకు సంబంధఙంచి విభజన ప్రక్రియ ఏ మేరకు సాగింది, ఇంకా మిగిలిన అంశాలు ఏమిటి మొదలైన వివరాలను రాయ్ అడిగి తెలుసుకున్నారని సమాచారం. అలాగే ఏయే విభాగాల్లో విభజన సిరగాసాగడంలేదు, అందుకు గల కారణాల గురించి కూడా ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. అయితే పోలీసు శాఖలో కార్యాలయాల విభజనకు సంబంధించి కసర్తు పూర్తయ్యిందని, అలాగే ఆస్తులు, ఆయుధాలు, ఇతర మౌళిక సదుపాయాలను పంచే అంశాలు దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు డీజీపీ ప్రసాదరావు , రాయ్‌కు వివరించారని తెలిసింది.
డీఎస్‌పి ఆపై స్థాయి అధికారుల విభజనపై కసరత్తు సాగుతున్నదని, ఆ ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తిచేస్తామని ఆయన వివరించారని సమాచారం. ఇక గ్రేహౌండ్స్ ,అక్టోపస్‌విభాగాలు రెండు కూడా మూడు సంవత్సరాల పాటు కేంద్రం పర్యవేక్షణలో ఉంటాయి కాబట్టి, ఇందులో అధికారులు, సిబ్బందిని రెండు రాష్ట్రాల నుంచి ఆ మూడు సంవత్సరాలపాటు డిప్యూటేషన్ క్రిందా కొనసాగించేలా ఒక ప్రణాళికను గ్రేహౌండ్స్ అధికారులురూపొందించారని తెలిసింది.