
సాక్షి, న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఈఏడాది జనవరిలో ప్రకటించిన ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఆధార్ పరిశీలన కోసం వేలిముద్రలు, కనుపాపలతో పాటు ముఖ గుర్తింపు సదుపాయన్నీ ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు యుఐడిఎఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే అధికారికంగా జూలై 1న లాచ్ చేయనున్నామని గత వారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వంటి సమస్యల వల్ల బయోమెట్రిక్ వివరాల ధృవీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న(ముఖ్యంగా వృద్ధులు) వారి కోసం ఇలాంటిది తీసుకు వస్తామని జనవరిలోనే యూఐడీఏఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీం కోర్టుకు కూడా ఈ విషయన్ని నివేదించింది. అయితే ఆధార్ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్‌టైం పాస్‌వర్డ్(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది.