
పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు నాగరాజు
ఎమ్మెస్కే ప్రసాద్ పేరు చెప్పి పలువురి నుంచి వసూళ్లు
గుణదల (విజయవాడ తూర్పు): అతను ఉన్నత విద్యావంతుడు. దానికితోడు మంచి క్రికెటర్. పేద కుటుంబం నుంచి వచ్చి ప్రతిభ చూపి రంజీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే స్థాయికి ఎదిగాడు. 82 గంటలపాటు క్రికెట్ ఆడటం ద్వారా గిన్నిస్ బుక్‌లో కూడా స్థానం సంపాదించాడు. అయితే, బుద్ధి వక్రించడంతో కటకటాల పాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ ఏసీపీ వైబీసీసీఏ ప్రసాద్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరి నాగరాజు (24) పేద కుటుంబానికి చెందిన యువకుడు. ప్రస్తుతం విశాఖపట్నం మధురవాడ గాయత్రీనగర్‌లో ఉంటున్న నాగరాజు ఎంబీఏ వరకు చదువుకున్నాడు. చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని గేమ్‌లో చక్కని ప్రతిభ కనబరిచేవాడు. 2006లో విశాఖ అండర్–14 కు ఎంపికయ్యాడు. ఆపై వరుసగా 7 సంవత్సరాలపాటు వివిధ జోన్ల తరఫున ఆడుతూ చక్కని ప్రతిభ కనబరిచాడు.
2014 లో ఆంధ్రా తరఫున రంజిలో కూడా ఆడాడు. 2016లో 82 గంటల పాటు క్రికెట్ ఆడి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. నాగరాజు ఆటను చూసి అతనిని ప్రోత్సహించే దిశగా అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో వచ్చిన సంపాదనతో జల్సాలకు అలవాటు పడ్డాడు. మరింత డబ్బు సంపాదించి విలాసవంతంగా గడపాలనే దురుద్దేశంతో ధోని క్రికెట్ అకాడమీ పేరుతో ఓ సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. ఈ క్రమంలో గత యేడాది నందం వేణుగోపాల్ అనే వ్యక్తిని మోసం చేసి రూ.22,300 నగదు తీసుకున్నాడు. ఈ ఘటనపై సదరు వేణుగోపాల్.. నాగరాజుపై విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే అలవాటుగా మారిన నాగరాజు ఈ యేడాది ఫిబ్రవరిలో టి–20 టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి మనోజ్ అనే వ్యక్తిని మోసం చేసి అతని వద్ద నుంచి రూ.20 వేలు వసూలు చేశాడు. ఇటీవల తాను ఎమ్మెస్కే ప్రసాద్‌నని నమ్మబలికి హైదరాబాద్‌కు చెందిన మురళీ అనే వ్యక్తి నుంచి రూ.2,88,000 వసూలు చేసి మోసం చేశాడు. ఇదే పంథాలో విజయవాడకు చెందిన రామకృష్ణ హౌసింగ్ సొసైటీ నిర్వాహకులకు ఫోన్ చేసి రూ.3,88,000 నగదు వసూలు చేశాడు. ఈ విధంగా ఎమ్మెస్కే ప్రసాద్ పేరును వాడుకుని డబ్బు వసూలు చేస్తూ జల్సాలకు అలవడిన నాగరాజుపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో గత నెల 22వ తేదీన కేసు నమోదు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలో నిందితుడు ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు నాగరాజును గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.1,80,500 నగదు, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో మాచవరం సీఐ జి శ్రీనివాస్, ఎస్‌ఐ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.