
సాక్షి, గుంటూరు: ఈఎస్‌ఐ స్కామ్‌లో మూడో రోజు ఏసీబీ విచారణ ముగిసింది. జీజీహెచ్‌లో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, ఈ రోజు కూడా ఆయన విచారణకు సహకరించలేదని తెలిసింది. టెలీహెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్ట్ ఇవ్వమని ఆదేశించిన లెటర్‌ను ఏసీబీ బయటపెట్టింది. ఆ లెటర్ లో ‘మై ఆర్డర్’ అనే పదాన్ని వాడటం వెనుక ఉద్దేశాన్ని ఏసీబీ ప్రశ్నించింది. టెలీ హెల్త్ సర్వీసెస్ కాంట్రాక్టర్ తో అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. కోట్ల రూపాయలు ఒకే సంస్థకు చెల్లించడంపై ప్రశ్నించారు. కాల్ సెంటర్ కు వచ్చిన కాల్స్ పై కూడా ఏసీబీ అధికారులు విచారించారు. ఆ ఫోన్ నెంబర్లన్నీ తెలంగాణవేనని నిర్ధారణ అయినట్టు సమాచారం. ఈసీజీ పేరుతో డబుల్ రేట్లు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే చేసి నిధులు కొల్లగొట్టినట్లు తేలింది. కాగా, అచ్చెన్నాయుడు సహా 8 మంది పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. వారికి జులై 10 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
(‘ఎందుకలా చేశారు.. మీ ఇంట్రెస్ట్ ఏమిటి’)