
సాక్షి, విశాఖపట్నం: నగరంలో సంచలనం సృష్టించిన ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. కిడ్నాప్, దాడి వ్యవహారంలో అప్పలరాజు చెప్పిన వివరాలు ప్రకారం ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లుగా పోలీసులు మొదట భావించారు. ఆ దిశగా లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు విచారణలో ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. సీసీ కెమెరాల పుటేజ్‌లు పోలీసులు పరిశీలించగా, ఒక్కడే ఆటో ఎక్కుతున్నట్టు గుర్తించారు. పొంతన లేని సమాచారంతో ఫైనాన్స్ వ్యాపారి.. పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. (ఎవరు చేస్తున్నారబ్బా..?)
తనని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాంపులు ధరించి తనని ఆటోలో కిడ్నాప్ చేశారన్న అప్పలరాజు.. సాగర్ నగర్- రుషికొండ మధ్యలో తనపై హత్యాయత్నం చేసి లక్షా 25 వేల నగదు, బంగారం దోచుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు బయటపడ్డాయి. అప్పలరాజు మాటలు అబద్దమని పోలీసులు తేల్చారు. షర్ట్ పై ఎటువంటి మరకలు లేకుండానే అప్పలరాజు పొట్టపై రెండు కత్తి గాట్లు ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారంలో ఒత్తిళ్లను పక్కదారి పట్టించేందుకు కిడ్నాప్ డ్రామా ఆడారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.