
భర్త దాడిలో చికిత్స పొందుతూ భార్య మృతి
విశాఖపట్నం: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి.. వెంకటేశ్వరమెట్టకు చెందిన పోలిపల్లి రమాదేవి, భీమ్‌నగర్‌కు చెందిన బంగార్రాజు భార్యాభర్తలు. ఇద్దరూ వృత్తిరీత్యా డ్యాన్సర్లు. రమాదేవి యాంకరింగ్ కూడా చేస్తుంటుంది.
వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రమాదేవి యాంకరింగ్ చేయడం బంగార్రాజుకు ఇష్టం లేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని బంగార్రాజు అనుమానించడంతో గొడవలు మరింత పెద్దవయ్యాయి. ఈ క్రమంలో గత నెల 31న గొడవ జరగడంతో.. రమాదేవి పిల్లలను తీసుకుని వెంకటేశ్వరమెట్టలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజు బంగార్రాజు అక్కడికి వెళ్లి, తిరిగి ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు.
ఆమె అందుకు నిరాకరించడంతో.. ఆగ్రహంతో ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి చెంపపై కొట్టాడు. ఈ ఘటనలో ఆమె పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తలకు బలంగా గాయమైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి బంధువులు బంగార్రాజుపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. బంగార్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.