
విశాఖ: నగరంలోని చోటు చేసుకున్న జంట హత్యల కేసు పోలీసులకు కాస్త తలనొప్పిగా మారింది. దోపీడీ దొంగలు పనై ఉంటుందని తొలుత భావించిన పోలీసులకు ఆ అనావాళ్లు ఏవీ కనిపించడం లేదు. హత్యకు గురైన యోగేంద్ర(66), లక్ష్మీ(58) ఇంట్లో ఎటువంటి చోరీ జరగలేదని గుర్తించారు పోలీసులు. వారికి సంబంధించిన బంగారం ఆభరణాల్లో కొన్నింటిని ఇంట్లోనే గుర్తించారు. అయితే పాత కక్ష్యల కారణంగానే హత్య చేశారని భావిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారు.
ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు..
ఈ జంట హత్యల కేసులో దుండగులు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా.. అత్యంత పకడ్బందీగా నేరానికి పాల్పడటంతో కేసు ఛేదన పోలీసులకు సవాల్‌గా మారింది. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి కేసు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. హత్యకు గురైన యోగేంద్రబాబు, ఆయన భార్య లక్ష్మి సుమారు 40 ఏళ్లుగా గాజువాకకు సమీపంలోని రాజీవ్‌నగర్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు
యోగేంద్రబాబు నావల్ డాక్‌యార్డ్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. స్థానిక గ్లోరియా(ఎయిడెడ్) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు శృతి, సుజన్ వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడటంతో.. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎవరితోనూ గొడవలు లేని వీరిని ఇంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది.
హత్య కోసం అదను చూసుకున్నారా?
హత్యకు గురైన దంపతులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు తమ పని కానిచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో అదను చూసుకుని కాపు కాసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటికి బంధువులు వస్తే కానీ తెలియలేదు..
శుక్రవారం రాత్రి వరకు ఈ దారుణం వెలుగులోకి రాలేదు. మృతుల బంధువుల కుమార్తె వారిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల ఫోన్ మోగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వంటివి దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వారి పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఇంట్లో ఏయే వస్తువులు, ఎంత నగదు, బంగారం పోయిందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.