పీఏసీ చైర్మన్గా బుగ్గన నియామకం | ysrcp mla buggana rajendranath reddy appoints AP PAC chairman | Sakshi
Sakshi News home page

పీఏసీ చైర్మన్గా బుగ్గన నియామకం

Published Mon, Apr 25 2016 7:24 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

పీఏసీ చైర్మన్గా బుగ్గన నియామకం - Sakshi

పీఏసీ చైర్మన్గా బుగ్గన నియామకం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నిమాయకాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం ప్రకటించారు. కాగా తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవల పీఏసీ చైర్మన్ పదవికి రాజేంద్రనాథ్‌ రెడ్డి పేరును సిఫారసు చేశారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం ఆయన నియామకాన్ని ప్రకటించారు. శాసనసభ నియమనిబంధనల ప్రకారం ప్రధాన విపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కుతుంది. 

వివిధ అంశాలపై అవగాహన ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డి అధ్యయనశీలిగా, మంచి వక్తగా అనతికాలంలోనే పేరు పొందారు. అంచనాల కమటీ చైర్మన్‌గా గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్‌గా కాగిత వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ బులెటిన్ విడుదల చేశారు. మిగిలిన కమిటీలకు గతంలో చైర్మన్లుగా ఉన్న వారే కొనసాగే అవకాశం ఉంది. కమిటీల చైర్మన్లు, సభ్యులుగా ఎవరిని నియమించాలనే అంశంపై ఇటీవల చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు సురేష్ కసరత్తు చేసి జాబితాను తయారు చేశారు. ఆ జాబితాను అసెంబ్లీ సచివాలయానికి పంపారు. వీటికి రెండు, మూడు రోజుల్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

పీఏసీ సభ్యులుగా ఆదిమూలం సురేష్,దాటిశెట్టి రాజా, టీడీపీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు,టి.శ్రావణ్‌కుమార్, బీకే పార్ధసారధి, గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, పి. విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ , టీడీ జనార్ధన్, బి. చెంగల్రాయుడు ఉన్నారు. అంచనాల కమిటీ సభ్యులుగా చింతల రామచంద్రారెడ్డి, కంబాల జోగులు, చిర్ల జగ్గిరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, యరపతినేని శ్రీనివాసరావు, ఎం. గీత, జి. శంకర్ , పీవీజీఆర్ నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీలు డాక్టర్ గేయానంద్, సోము వీర్రాజు నియమితులయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సభ్యులుగా పీడిక రాజన్నదొర, గొట్టిపాటి రవికుమార్, కొరుముట్ల శ్రీనివాసులు, కోళ్ల లలితకుమారి, పి. శ్రీనివాసులురెడ్డి, వి. ప్రభాకరచౌదరి, వీవీ శివరామరాజు, ఏ. సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, పీజే చంద్రశేఖర్ , గాదె శ్రీనివాసులు నాయుడు ఉన్నారు.


మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలంటూ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement