తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే భివండీ పవర్‌లూమ్ పరిశ్రమలను అతలాకుతలం చేసింది.
సాక్షి, ముంబై: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే భివండీ పవర్‌లూమ్ పరిశ్రమలను అతలాకుతలం చేసింది. వేలమంది తెలంగాణ కార్మికులు భివండీలోని పవర్‌లూమ్ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. సర్వే కారణంగా కార్మికులంతా తెలంగాణలోని సొంతగ్రామాలకు వెళ్లిపోయారు. ఇంకా కార్మికులు పరిశ్రమలకు చేరుకోకపోవడంతో పవర్‌లూమ్ పరిశ్రమలు వెలవెలబోయాయి.
సర్వేకు పట్టణంలోని సుమారు 50 వేల మంది ప్రజలు తరలి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిపై ఆధారపడి ఉన్న పరిశ్రమలు, తదితర వ్యాపారాలపై భారీ ప్రభావం పడుతోంది. కేసీఆర్ తెలంగాణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించినట్లయితే భివండీలో స్థిరపడ్డ గుజరాతి, ముస్లిం, మార్వాడీ, మరాఠీ వ్యాపారాలు దెబ్బతింటాయని పలువురు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భివంఢీ నుంచి తెలంగాణ బాట
భారతదేశ మాంచస్టర్‌గా పేరు గాంచిన భివండీ పట్టణంలో భారీ సంఖ్యలో పవర్‌లూమ్ పరిశ్రమలు మూతపడ్డాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్ వివిధ జిల్లాల ప్రజలు ఉపాధి కోసం భివండీ వచ్చి స్థిరపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇక్కడ స్థిరపడ్డ ప్రజలతో పాటు ఒంటరిగా వచ్చిన కార్మికులు కూడా ఈ నెల 15 నుంచి తెలంగాణ బాట పట్టారు. ఈ నెల 29న వినాయక చవితి పండుగ ఉండడంతో కొందరు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో అక్కడే ఆగిపోయారు. ఇప్పటికే పట్టణంలోని సుమారు 20 వేలకు పైగా పవర్‌లూమ్ యంత్రాలు నిలిచిపోయాయి. నిత్యం లక్ష రూపాయల నష్టపోతున్నామని వ్యాపారస్తులు వాపోతున్నారు.