
సాక్షి బెంగళూరు: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏ నియోజకవర్గానికీ ఎమ్మెల్యే కాదు.. ఈయనకు ఏ ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేదు. కానీ తనను ముఖ్యమంత్రిని చేయండంటూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రంలోని తీర్థహళ్లికి చెందిన ఆర్.హరిశ్చంద్రగౌడ కాంగ్రెస్ కార్యకర్త. తనను ముఖ్యమంత్రి చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయస్థానం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తన వాదనను వినిపించారు.
ముఖ్యమంత్రి కుమారస్వామికి స్విస్ బ్యాంకులో రూ.వేల కోట్లున్నాయని, తనను ముఖ్యమంత్రిని చేస్తే ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకొచ్చి రాష్ట్రంలోని రైతులందరి రుణాలను మాఫీ చేస్తానని చెప్పాడు. తనను ముఖ్యమంత్రి చేయాలని గవర్నర్ వాజుభాయి వాలాకు విన్నవించానని, తన విజ్ఞప్తిని ఆయన పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నాడు. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు సూచించాలని కోరాడు. ఆయన వాదన విన్న న్యాయమూర్తి. ఈ కేసు విచారణను వాయిదా వేశారు.