
న్యూఢిల్లీ: భారతదేశంలోని జీవ వైవిధ్యం ప్రపంచ మానవాళికి ఒక విశిష్టమైన నిధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సృష్టిలోని అన్ని జీవరాశుల పట్ల అనురాగం, ప్రకృతి పట్ల ప్రేమ కలిగి ఉండాలని చెప్పారు. ప్రతిఏటా ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో రకాల పక్షులు భారత్‌కు వస్తున్నాయన్నారు. వలస పక్షులకు భారత్ ఇల్లులా మారిందన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ నిర్వహించిన హునర్ హాట్ కార్యక్రమం గురించి ప్రస్తావించారు.
భాగీరథీ అమ్మ స్ఫూర్తిదాయకం..
ఆయన మాట్లాడుతూ.. ‘లక్ష్యాలు సాధించడానికి వయసు, వైకల్యం ఎంతమాత్రం అడ్డంకులు కావు. ఏదైనా సాధించాలని సంకల్పిస్తే మనలోని విద్యార్థిని చంపకూడదు. కేరళలో భాగీరథీ అమ్మ అనే మహిళ 105 ఏళ్ల వయసులో లెవల్ 4 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం, కామ్యా కార్తికేయన్ అనే 12 ఏళ్ల బాలిక దక్షిణ అమెరికాలోని 7,000 మీటర్ల ఎత్తయిన మౌంట్ అకోకాంగువాను అధిరోహించడం సంతోషకరం’ అన్నారు. చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్నారు. దేశీయంగా తయారు చేసిన బయో–జెట్ ఇంధనాన్ని ఇటీవల ఇండియర్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఏఎన్–32 రవాణా విమానంలో ఉపయోగించామని. మొత్తం ఇంధనంలో 10 శాతం మనం సొంతంగా తయారు చేసిన ఇంధనమే వాడామన్నారు. రెండు ఇంజన్లలో ఇలాంటి బయో–జెట్ ఇంధనం వాడడం ఇదే మొదటిసారి అన్నారు.