
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథోత్సవం నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరాదని షరతు విధించింది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మంచి రికార్డును పరిగణనలోకి తీసుకున్నాం. అదే జాగ్రత్త, అప్రమత్తతను రథయాత్ర విషయంలోనూ కనబరుస్తారని ఆశిస్తున్నాం.
18, 19వ శతాబ్దంలో ప్రబలిన ప్లేగు, కలరా ఇలాంటి ఉత్సవం వల్లే ప్రబలిందని మనకు చరిత్ర చెబుతోంది. దానిని దృష్టిలో ఉంచుకునే 18వ తేదీ నాటి తీర్పులో ఈ ఉత్సవంపై స్టే విధించాం. యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోకుంటే అలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదముంది’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు ఒడిశాలోని పూరీ యాత్రపైనే తప్ప, ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కాదని పేర్కొంది. గతంలో విధించిన స్టేను ఎత్తేయాలంటూ జగన్నాథ్ సంస్కృతి జన జాగరణ మంచ్, బీజేపీ నేత సంబిత్ మహాపాత్ర తదితరులు పిటిషన్లు వేయడం తెల్సిందే.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బొపన్నల బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నాగ్‌పూర్‌లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ ట్రస్టు సహకారంతో ప్రజారోగ్యంపై ఏ మాత్రం రాజీపడకుండా రథ యాత్రను చేపడతామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ హామీ ఇచ్చారు. కేంద్రం, ఆలయ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని రథయాత్రను నిబంధనలకు లోబడి సజావుగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర 10 నుంచి 12 రోజుల పాటు కొనసాగనుంది.
సుప్రీంకోర్టు నిబంధనలివీ
► రథయాత్ర సమయంలో పూరీ నగరంలో కర్ఫ్యూ విధించాలి.
► ప్రజలు ఇళ్లలోంచి బయటకురావద్దు
► ఒక్కో రథాన్ని 500 మంది (పోలీసులు, సిబ్బంది కలిపి) మాత్రమే లాగాలి.
► ఒక్కో రథం గంట సమయం తేడాతో ముందుకు కదలాలి.
► నగరంలోకి ప్రవేశించే అన్ని దారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను మూసివేయాలి.
► తీర్పు వెలువడిన సోమవారం రాత్రి 8 గంటల నుంచే కర్ఫ్యూ అమలు.
► వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమం కవరయ్యేలా మీడియాకు అనుమతి.
► రథాన్ని లాగే వారందరికీ కరోనాæ పరీక్షలు చేయాలి. రథయాత్రకు ముందు, రథయాత్ర సమయంలో, తర్వాతా వారు భౌతిక దూరం పాటించాలి. వారందరి ఆరోగ్య రికార్డులను నిర్వహించాలి.