
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారం మరోసారి హైకోర్టులో తెర పైకి వచ్చింది. భవనాల్ని కూల్బబోమని 2016లో హైకోర్టుకు ప్రభుత్వం తరఫున అప్పటి అడ్వొకేట్ జనరల్ రామృష్ణారెడ్డి ఇచ్చిన హామీకి విరుద్ధంగా కూల్చివేత చర్యలు తీసుకోబోతున్నందున ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి తరఫు న్యాయవాది సత్యంరెడ్డి కోర్టును కోరారు. దీనిపై వచ్చే శుక్రవారం (28న) విచారణ జరుపుతామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ప్రకటించింది. ఈ భవనాలను వందేళ్ల వరకూ వినియోగించుకోవచ్చని, ఎర్రగడ్డలో కొత్త సచివాలయం నిర్మాణం, ఇతర వసతులు కల్పించేందుకు రూ.600 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయాల్సి వస్తుందని జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా పిల్‌ను దాఖలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఎర్రమంజిల్‌లోని భవనాల్ని కూల్చొద్దు..
హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని చారిత్రక భవనాల్ని కూల్చి ఆ ప్రదేశంలో కొత్తగా శాసనసభ, శాసనమండలి భవనాలను నిర్మించాలనే ప్రయత్నాలను నిలిపేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. కొత్త చట్టసభల భవనాల కోసం ఈ నెల 27న భూమి పూజ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, హైకోర్టు అడ్డుకోకపోతే చారిత్రక భవనాన్ని కూల్చివేసే ప్రమాదముందని జగిత్యాల జిల్లా ధర్మపురి వాస్తవ్యుడు జె.శంకర్ పిల్‌లో పేర్కొన్నారు.