
నగిరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా
మహిళల సమస్యలపై పోరాడుతుంటే తన పైన తప్పుడు కేసులు పెడుతున్నారు.
సాక్షి, తిరుపతి: ప్రజాసమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నాయకులపై టీడీపీ ప్రభుత్వం అక్రమకేసులు పెడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగిరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో అమె మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని ఆరోపించారు. చంద్రబాబు మహిళా ద్రోహి అంటూ రోజా పేర్కొన్నారు. మహిళల సమస్యలపై పోరాడుతుంటే తన పైన తప్పుడు కేసులు పెడుతున్నారని.. కేసులకు భయపడే పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తానని ఆమె తెలిపారు.
పోలీసు వ్యవస్థపై తనకు అపార గౌరవం ఉందని, కానీ.. నగిరి సీఐ టీడీపీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని విమర్శించారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళాధ్యక్షురాలు ఆర్‌కే రోజాపై అక్రమ కేసులకు నిరసనగా చిత్తూరు జిల్లా పార్టీ మహిళాధ్యక్షురాలు గాయత్రిదేవి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.