జయలలిత మేనకోడలు దీప నేతృత్వంలోని ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ మూణ్ణాళ్ల్ల ముచ్చటగా మారిపోతోంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మేనకోడలు దీప నేతృత్వంలోని ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ మూణ్ణాళ్ల్ల ముచ్చటగా మారిపోతోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని దీపపై కార్యకర్తలు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి. దీప పేరవైని ఎత్తివేసి పన్నీర్ పంచన చేరే ప్రయత్నాల్లో భాగంగా ఈనెల 19వ తేదీన పేరవై నేతలు తిరుచ్చిలో సమావేశం అవుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పులు తెచ్చింది. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలుగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోగా, జయలలిత రాజకీయ వారసురాలిగా దీప రాజకీయ అరంగేట్రం చేశారు.
జయ మరణించిన నాటి నుంచి తండోపతండాలుగా వస్తున్న అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల అండదండలతో గత నెల 24వ తేదీన ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ని స్థాపించారు. కార్యవర్గ నిర్మాణంలో దీప కారు డ్రైవర్‌కు ప్రముఖ స్థానం కల్పించడంతో పేరవై ముసలం మొదలైంది. ఇదే సమయంలో ఆర్కేనగర్ నుంచి స్వతంత్య అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు దీప ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. దీపతో పాటు ఆమె భర్త మాధవన్ సైతం ఈనెల 16వ తేదీన ఆర్కేనగర్‌లో వేదికెక్కి ప్రచారంలో పాల్గొన్నారు. జయలలితకు రెండుసార్లు అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఆర్కేనగర్ ప్రజలు దీపకు సైతం పట్టకడుతారని పేరవై నేతలు విశ్వసించారు.
దీపకు షాకిచ్చిన భర్త మాధవన్:
ఇదిలా ఉండగా భర్త మాధవన్ అకస్మాత్తుగా భార్య దీపకు గట్టి షాకిచ్చారు. శుక్రవారం రాత్రి చెన్నై మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు వెళ్లి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అంతేగాక తన భార్య దీప పెట్టింది కేవలం ఒక సంఘం మాత్రమే రాజకీయ పార్టీ కాదని వ్యాఖ్యానించారు. దీప పేరవైలో దుష్టశక్తులు ప్రవేశించాయని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామం అటు దీపను, ఇటు దీప పేరవై నేతలను ఆందోళనకు గురిచేసింది. దీప వ్యవహారశైలి అంటే భర్తకే గిట్టనపుడు పేరవై నేతలతో ఎలా మెలుగుతారని సందేహం మొదలైంది.
జయలలిత స్థానంలో దీపను ప్రోత్సహించాలని భావించిన వారిలో ముఖ్యుడైన తిరుచ్చిరాపల్లి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సుందరరాజన్ తీవ్రంగా స్పందించారు. దీప పేరవైని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్న ఆయన తాజా పరిణామాలతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాష్ట్రంలోని పేరవై నేతలతో మాట్లాడి దీప పేరవైని ఎత్తివేయాలని సంకల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయంలో భాగంగానే ఆదివారం నాడు తిరుచ్చిలో పేరవై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీప వ్యవహారశైలి తీవ్ర అసంతృప్తికరమని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలతో పేరవై కార్యకర్తలకు ఉత్తరాలు రాశారు.
దీపపై నమ్మకంతో ఆమె చుట్టూ తిరిగిన వారంతా తనపై ఒత్తిడి తెస్తున్నందున వారికి తగిన పరిహారం, ప్రత్యామ్నాయ మార్గం చూపాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఉత్తరంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 19వ తేదీన తిరుచ్చిలో జరిగే సమావేశానికి రాష్ట్రంలోని పేరవై నేతలు, కార్యకర్తలంతా కదలిరావాలని ఉత్తరం ద్వారా ఆహ్వానించారు. విశ్వసనీయ సమాచారాన్ని బట్టి దీప పేరవైని ఎత్తివేసి సుందరరాజన్ నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంలో చేరిపోతారని తెలుస్తోంది.
ఆమోమయంలో దీప:
ఒకవైపు భర్త, మరోవైపు పేరవై తనకు దూరమైపోతున్న పరిస్థితిలో దీప ఆయోమయంలో పడిపోయారు. ఆర్కేనగర్‌లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తనకు అండగా నిలవాల్సిన పేరవై కార్యకర్తలు ప్రత్యర్థి వర్గంలో చేరిపోతే దిక్కెవరని ఆందోళన చెందుతున్నారు. ఈనెల 19వ తేదీన తిరుచ్చీలో జరిగే దీప పేరవై సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఆమె ఆందోళనకు గురవుతున్నారు.