ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ ఇంట్లో ఉండి సహకరించాలని సమాయత్తం అవుతున్న నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది.
మేడ్చల్: ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ ఇంట్లో ఉండి సహకరించాలని సమాయత్తం అవుతున్న నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ 19న జరిగే సర్వే అధికారులకు సవాల్‌గా మారింది. జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.
ఇది హైదరాబాద్ శివారులో ఉండడంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఈ ప్రాంతం కబ్జాదారులకు నిలయంగా మారింది. కాస్తోకూస్తో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతంలో నేతలుగా చలామణి అవుతూ భూకబ్జాలు చేశారు. ఒక్కొక్కరు సుమారు 10 నుంచి 20 ఇళ్లను బినామీ పేర్లతో నిర్మించడమే కాకుండా ప్లాట్లను కబ్జా చేశారు. తాజాగా ప్రభుత్వం ఇంటింటికీ సమగ్ర సర్వే కార్యక్రమం చేపట్టడంతో తమ గుట్టు ఎక్కడ రట్టవుతుందోననే ఆందోళన అక్రమార్కుల్లో మొదలైంది.
సర్వేలో తమ బాగో తం బయట పడకుం డా 10 రోజుల ముం దు నుంచే తమ ప్ర ణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇం దులో భాగంగా కబ్జాల్లోని ఇళ్లను, భూములను కాపాడుకోవడానికి తమ బంధుమిత్రులనో, కుటుంబ యజమానులు కానివారినో ఎంత కొంత డబ్బు ఇచ్చి జవహర్‌నగర్‌కు రప్పించే యత్నాలు చేస్తున్నారు. వారికి ముందుగానే అన్ని విషయాలు చెప్పి సర్వే రోజు అధికారులకు ఎలా సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై శిక్షణ ఇస్తున్నారు.
తమ కబ్జాలోని ఇళ్లు, స్థలాలు, బినామీ పేర్లను తమ బంధుమిత్రులకు ముందుగానే తెలియజేసి వాటికి సంబంధించిన జిరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. జవహర్‌నగర్ పరిధిలో ఇళ్ల రెగ్యులరైజేషన్‌ను గత ప్రభుత్వాలు చేయకపోవడంతో పేరుకు లక్ష జనాభా, 20 వేల కుటుంబాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా ఏ ఇల్లు ఎవరిదో.. ఏ స్థలం ఎవరిదో.. అర్థం కాని విచిత్ర పరిస్థతి నెలకొంది. దీంతో జవహర్‌నగర్‌లో కుటుంబ సమగ్ర సర్వే అధికారులకు సవాల్‌గా మారింది.