
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోత పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 16వ తేదీకి వాయిదా పడింది. బుధవారం ఈ కేసును జస్టిస్ యూడీ సాల్వీ బెంచ్ విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, ప్రాజెక్టుకు సంబంధించి అన్నిరకాల అనుమతులు వచ్చాయని తెలిపారు.
పర్యావరణ అనుమతులు లభించనప్పుడు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తూ పనులు చేపట్టిందని, దీనిపై విచారణ జరిపేందుకు కమిషన్ ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరిపించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ కోరారు. అనుమతులు లభించనప్పుడు ప్రభుత్వం కేవలం తాగునీటి అవసరాల కోసమే పనులు చేపట్టిందని, తాగునీటి అవసరాల కోసం చేపట్టే పనులకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ కల్పించుకుని అసలు పిటిషనర్లు దాఖలు చేసిన అప్లికేషన్ విచారణ చేయదగిందా? లేదా? అన్నది ముందు తేల్చుతామని అనంతరం విచారణ పరిధిపై నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.