
సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమేనని, అవి న్యాయవ్యవస్థ స్వతంత్రత, స్థాయి దెబ్బతినకుండా ఉండాలని సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, లా కమిషన్ పూర్వపు చైర్మన్, రెండో జాతీయ జ్యుడీషియల్ పే కమిషన్ చైర్మన్ జస్టిస్ పి.వెంకటరామరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజావసరాలే కాకుండా న్యాయవ్యవస్థపై వారు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా అర్థవంతమైన సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కోకా రాఘవరావు లా ఫౌండేషన్ సహకారంతో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏసీ) శుక్రవారం హైదరాబాద్‌లో ‘న్యాయ సంస్కరణలు’పై జాతీయ స్థాయి సదస్సును నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ‘లా కమిషన్ చైర్మన్‌గా ఉండగా దేశంలో ఆరు రాష్ట్రాల్లో పది చొప్పున మోడల్ కోర్టులు ఉండాలనే ప్రతిపాదనపై ఆర్థిక, న్యాయ శాఖల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన ఒక ప్రధాన న్యాయమూర్తి అయితే అన్ని కోర్టులూ మోడల్ కోర్టులు కావాలని చెప్పారు. చివరికి నిధులు మురిగిపోయాయి ఆ ప్రతిపాదన బుట్టదాఖలైంది’అని జస్టిస్ వెంకటరామరెడ్డి ఆందోళన వెలిబుచ్చారు.
సాయంత్రపు కోర్టులుండాలి: సంస్కరణల ప్రతిపాదనలు ఫైళ్లకు పరిమితం కారాదని జస్టిస్ వెంకటరామరెడ్డి అన్నారు. 2010–11 కాలంలో సాయంత్రం పనిచేసే కోర్టులుండాలని, న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కోర్టులుండాలని, ఫ్రీ బార్గయినింగ్ కోర్టులు ఉండాలనే ప్రతిపాదనలు అమలు కాలేదని ఆయన తన అనుభవాలను గుర్తు చేశారు. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల అంశంపై మాట్లాడుతూ.. కొలీజియానికి చేరిన జాబితాపై సంప్రదింపులు చేయడం మంచి పరిణామమని చెప్పారు.
పాలనాపర అంశాలకు ఫుల్ బెంచ్: పాలనాపరమైన అంశాలపై న్యాయమూర్తుల్లో విబేధాలు తలెత్తినప్పుడు ఫుల్ బెంచ్ (మొత్తం న్యాయమూర్తులందరూ) సమావేశమై వాటిని పరిష్కరించుకోవాలని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లలిత్ భాసిన్ సూచించారు. ఈ సందర్భంగా జస్టిస్ వెంకటరామరెడ్డిని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ సెక్రటరీ హెచ్‌సీ ఉపాధ్యాయ సత్కరించారు. సదస్సులో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కోకా రాఘవరావు, ఢిల్లీ హైకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి, సీనియర్ న్యాయవాదులు ఎం. భాస్కరలక్ష్మి, సరసాని సత్యంరెడ్డి, ఎమ్మెస్ ప్రసాద్ వివిధ రాష్ట్రాల న్యాయవాదులు, లా విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు.