Devadula lift irrigation scheme
-
‘దేవాదుల’ నీటి విడుదల
ధర్మసాగర్/హసన్‌పర్తి: ఎట్టకేలకు దేవన్నపేటలోని పంప్‌హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి మంత్రులు నీటిని విడుదల చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలోని పంప్‌హౌస్ నుంచి 3వ ఫేజ్ పైప్‌లైన్ మోటార్‌ను ప్రారంభించడానికి వారం రోజుల క్రితం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ«నివాస్‌రెడ్డి రాగా, సాంకేతిక సమస్యతో మోటార్లు ఆన్ కాని విషయం తెలిసిందే. మరమ్మతుల అనంతరం రెండు రోజల క్రితం కూడా మళ్లీ ట్రయన్‌రన్ చేయగా, గేట్‌వాల్‌్వలు పడిపోయాయి. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. దీంతో గురువారం తెల్లవారు జామున ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. సాయంత్రం మంత్రులిద్దరూ దేవన్నపేటలోని పంప్‌హౌస్ వచ్చారు. అయితే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో అరగంట పాటు ఆగాల్సి వచి్చంది. టెక్నీషియన్లు సమస్యను పరిష్కరించిన తర్వాత మంత్రులు మోటార్లు ఆన్ చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం : మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దేవన్నపేటలోని పంప్‌హౌస్ నుంచి 3వ ఫేజ్ పైప్‌లైన్ మోటార్‌ను గురువారం సాయంత్రం ఆయన ఆన్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ వద్ద నీటిలో పూలు, చీర, సారె వదిలారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం డిసెంబర్‌లోపు అన్ని పనులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తామన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఒక పంప్ ఆన్ చేసి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని,. రెండవ మోటారును కూడా 15 రోజుల్లో ఆన్ చేస్తామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర నిధులు అందించాలని కోరుతూ కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమైన విషయాన్ని గుర్తు చేశారు. దేవన్నపేట వద్ద పంప్‌హౌస్‌ను అద్భుతమైన డిజైన్‌తో రూపొందించామని, 144.50 మీటర్ల లోతులో 25.50 మీటర్ల వెడల్పుతో నిర్మిoచిన ఈ పంప్‌హౌస్‌లో మూడు 31 మెగావాట్ల సింక్రోనస్ మోటార్లు అమర్చామని చెప్పారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టును నేడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే 3వ దశ పనులు పూర్తి చేసి మోటార్లను ఆన్ చేసిందన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు మంత్రి ఉత్తమ్ అధికారులను పరుగులు పెట్టించి టెక్నికల్‌గా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించి ఒక మోటార్‌ను ఆన్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడి యం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని, ఈఎన్సీ అనిల్‌కుమా ర్, సీఈ అశోక్‌కుమార్, ఎస్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ముందుకు సాగని మూడో దశ
సాక్షిప్రతినిధి, వరంగల్: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ ముందుకు సాగడం లేదు. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూ పాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతో పాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 6.21లక్షల ఎకరాలకు నీరిందించే ఈ ప్రాజెక్టు 18 ఏళ్లు కావస్తున్నా పూర్తి కావడం లేదు. రెండున్నర వేల ఎకరాలకు పైగా భూసేకరణ, కొన్నిచోట్ల రిజర్వాయర్లు పూర్తికాలేదు. సొరంగం పనులు పూర్తయినా కాల్వల లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. 2004లో రూ.6,084 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,945 కోట్లకు పైగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. 6.21 లక్షల ఎకరాలకు పెరిగిన లక్ష్యం 3లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 2004 లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ ప్ర భుత్వం ఏర్పాటైన తర్వాత ఆయకట్టు లక్ష్యం 6.21 లక్షల ఎకరాలకు పెరిగింది. దేవాదుల ఎత్తిపోతల జలాలను ఉమ్మడి వరంగల్ జిల్లాకే వినియోగించాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో 5.61లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యం తో పనులు ప్రారంభించారు. అయితే ఇతర జిల్లాల రైతాంగ అవసరాలను బట్టి ఆయకట్టు లక్ష్యం 6.21 లక్షల ఎకరాలకు చేరింది. మొదటి దశలో 1.23 లక్షలు, రెండోదశలో 1.91 లక్షలు, మూడోదశలో 3.07 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం పనులు మొదలు పెట్టారు. తొలుత 38.182 టీఎంసీలను పంపింగ్ చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు పెరి గిన ఆయకట్టు దృష్ట్యా దాదాపు 60 టీఎంపీల నీటి ఏటా ఎత్తిపోయాల్సి ఉంది. మొదటి రెండు దశల పనులు దాదాపుగా పూర్తికాగా మూడో దశ పనుల్లో ఎప్పటికప్పుడు తీవ్ర జాప్యం జరుగుతోంది. భూసేకరణకు అడ్డంకిగా కోర్టు కేసులు ఈ ప్రాజెక్టు కోసం 31,383 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 28,793 ఎకరాలు సేకరించారు. మరో 2,590 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, కోర్టు కేసుల వంటివి అడ్డంకిగా మారాయి. మరోవైపు పాలకుర్తి, లింగాల గణపురం మండలంలోని నవాబ్‌పేటలో రిజర్వాయర్లు పూర్తి కావలసి ఉంది. ఇక, దేవాదుల ప్రాజెక్టులో కీలకమైంది 49.08 కిలోమీటర్ల హైడ్రాలిక్ అండర్ టన్నెల్. మూడో దశ, మూడో ప్యాకేజీ కింద చేపట్టిన ఈ టన్నెల్ పనులకు 2008 నుంచి 2014 వరకు అవాంతరాలు ఏర్పడ్డాయి. 3 కాంట్రాక్టు ఏజెన్సీలను మార్చారు. తెలం గాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో రూ.1,494 కోట్ల అంచనాతో పనులు పునఃప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు సొరంగం పనులు పూర్తయినా, కాల్వల లైనింగ్ పనులు సాగుతున్నాయి. ధర్మసాగర్ చెరువులో నుంచి డిస్ట్రిబ్యూటరీ ద్వారా 1,22,700 ఎకరాలకు కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు రెండు (45 అండ్ 46 ) ప్యాకేజీల ద్వారా రూ.150.43 కోట్లతో పనులు చేపట్టారు. -
దేవాదులకు కాళేశ్వరం జలాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో మరో కొత్త ప్రతిపాదనను సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చారు. గోదావరి జలాల ఆధారంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకంలో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న జలాలను తరలించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా నీటిని దేవాదుల ఆయకట్టుకు తరలించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రగతిభవన్‌లో శనివారం కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదులను ఇన్‌టేక్ పాయింట్ గంగాపురానికి 187 కిలోమీటర్ల దూరంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు కాళేశ్వరం జలాలు తరలింపు, తపాస్‌పల్లి కింద ఉన్న 92వేల ఎకరాల ఆయకట్టుకు మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించేలా అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి పది కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ నిర్మించి కనీసంగా 10 టీఎంసీల నీటిని తపాస్‌పల్లికి నీటిని అందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఈ ప్రతిపాదనకు రూ.100 కోట్ల మేర ఖర్చు అవుతుందని, మల్లన్నసాగర్లో కనీసంగా 30 టీఎంసీల నీటి లభ్యత ఉంటేనే గ్రావిటీ ద్వారా నీటి లభ్యత సాధ్యపడుతుందని అధికారులు వివరించారు. ఇదే సందర్భంగా ఫ్రెషర్ మెయిన్ ద్వారా నీటిని తరలించేలా రెండో ప్రతిపాదనను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పద్ధతిన నీటిని తరలించేందుకు గరిష్టంగా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు జరిగే అవకాశం ఉంటుందని, మల్లన్నసాగర్లో 12 టీఎంసీల నీటి తరలింపు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలను ఏది ఉపయుక్తంగా ఉంటుందో తెలపాలని సీఎం సూచించారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి దేవాదుల మూడో దశను పూర్తి చేయాలని, మల్లన్నసాగర్‌ను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులను ప్యాకేజీ వారీగా సమీక్షించిన సీఎం..భూసేకరణ అంశాలపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మార్గదర్శకం చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి సీతారామ ద్వారా గరిష్ట నీటి వినియోగం జరిగేలా చూడాలని చెప్పారు. దీంతో పాటు కాళేశ్వరం పనులపైనా సీఎం సమీక్షించారు. -
దేవాదుల ప్యాకేజీ–2 పనులు పాత ఏజెన్సీకే
రూ.1,101కోట్ల పైప్‌లైన్ పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల పథకం మూడోదశ ప్యాకేజీ–2లో భాగంగా భీమ్ ఘన్పూర్ నుంచి రామప్ప వరకు రీ ఇంజనీరింగ్ తర్వాత నిర్మించతలపెట్టిన పైప్‌లైన్ పనులను పాత కాంట్రాక్టు ఏజెన్సీల కే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు శుక్రవారం నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. రీ ఇంజనీరింగ్‌కు ముందు టన్నెల్‌ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. అయితే టన్నెల్ తవ్వకాలవల్ల పక్కనే ఉన్న రామప్ప దేవాలయానికి పగుళ్లు ఏర్పడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో టన్నెల్‌కు బదులు ‘3 మీటర్ డయామీటర్’తో మూడు వరుస పైప్లైన్లను భీమ్‌ఘన్‌పూర్ చెరువు నుంచి రామప్ప చెరువు వరకు వేయాలని నిర్ణయించారు. దీనికి గానూ భీమ్‌ఘన్‌పూర్ వద్ద పంప్‌హౌజ్, సర్జ్‌పూల్ వ్యవస్థ, రామప్ప చెరువు వద్ద పనులు చేపట్టేందుకు మొత్తంగా రూ.1,154.22కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఈ పనులను దక్కించుకున్న కోస్టల్–పటేల్–జ్యోతి కన్సార్షి యం 2015–16 ఎస్ఎస్ఆర్ రేట్లతో పనులు చేసేందుకు ముందుకు రావడంతో రూ.1,101.15కోట్లతో ఈ పనులను వారికే అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనిగరానికి రూ.22.72 కోట్లు సిద్దిపేట జిల్లాలోని శనిగరం మధ్యతరహా ప్రాజెక్టును ఆధునీకరిం చేందుకు రూ.22.72 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్యామ్ భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని ఇటీవల అక్కడ పర్యటించి వచ్చిన ఈఎన్సీ ప్రభుత్వానికి సూచించారు. ఈఎన్సీ సిఫార్సుల మేరకు ఆధునికీకరణకోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మీరేం ఇంజనీర్లయ్యా..?
నీటి నిల్వలపై డిప్యూటీ సీఎం కడియం ప్రశ్నల వర్షం సమాధానం చెప్పకపోవడంతో అధికారులపై అసహనం అవగాహన పెంచుకోవాలని సూచనలు పంటలు ఎండిపోకుండా నీరందించాలని ఆదేశాలు వరంగల్ : జిల్లాలో సాగునీటి శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు తమ విభాగంలోని వివరాలను చెప్పకపోవడంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసహనానికి గురయ్యారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ శాఖల ఇంజనీరింగ్, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి జిల్లాలోని ప్రాజెక్టుల రిజర్వాయర్లలో నీటి నిల్వల పరిస్థితిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక చెరువు కింద పూర్తి ఆయకట్టుకు నీరందించాలంటే ఆ చెరువును ఎన్నిసార్లు నింపాల్సి ఉంటుంది.. ఒకసారి నిం పితే ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చని ఒక ఇం జనీరింగ్ అధికారిని ఆయన ప్రశ్నించారు. దీం తో అధికారి నుంచి సమాధానం రాకపోవడం తో డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంజినీర్లు తమ పరిధిలోని చెరువుల ఆయకట్టుకు నీరందించే వివరాలు, లభ్యత గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు. జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చెరువుల్లో నీటిని నింపి వాటి పరిధిలో ఆయకట్టుకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేయాలి.. మొక్కజొన్న, పత్తి పంటల పరిస్థితిపై వ్యవసాయ అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుత ఆగస్టులో ఇప్పటివరకు వర్షాలు పడలేదని, మొక్కజొన్న 61 వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా.. 22వేల హెక్టార్లలో ఎండిపోయే పరిస్థితులు ఏర్పడినట్లు వ్యవసాయాధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేవాదు ల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ ఎల్ఎండీ కాల్వల ద్వారా నీటి లభ్యతకు అనుగుణంగా తాగునీటికి సరిపడే నిల్వలు పోనూ మిగిలిన నీటిని ఆయకట్టుకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులను సెప్టెంబర్‌లో గా నింపేందుకు రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, సాగునీటి పారుదల శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించుకుని పనిచేయాలన్నారు. దేవాదుల పంపింగ్‌తో ధర్మసాగర్ చెరువు కింద దక్షిణ, ఉత్తర కాల్వల ద్వారా బుధవారం(నేటి) నుంచి మొదటి విడత ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఉత్తర కాల్వ ద్వారా 5 క్యూమెక్సులు, దక్షిణ కాల్వ ద్వారా 6 క్యూమెక్సుల నీటిని మొదటి పది రోజులపాటు వార బందీ పద్ధతితో విడుదల చేయాలని సూచించారు. వారం రోజుల తర్వాత సరిపోయే నీటి మట్టం వచ్చిన తర్వాత ఆర్ఎస్.ఘనపురం కుడి కాలు వ ద్వారా పదిరోజుల పాటు వారబందీ పద్ధతి లో అందించాలన్నారు. సెప్టెం బర్ నాటికి వీటి పరిధిలోని అన్ని చెరువులకు నీటిని విడుదల చేయాలన్నారు. నీటి విడుదల సమయంలో కాల్వలకు గండ్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కలెక్టర్ కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీఈ విజయ్‌ప్రకాశ్, దేవాదుల సీఈ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఎస్ఈ వీరయ్య, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, జేడీఏ ఉషా, అధికారులు పాల్గొన్నారు.