రూ.1,101కోట్ల పైప్‌లైన్ పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల పథకం మూడోదశ ప్యాకేజీ–2లో భాగంగా భీమ్ ఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు రీ ఇంజనీరింగ్ తర్వాత నిర్మించతలపెట్టిన పైప్‌లైన్ పనులను పాత కాంట్రాక్టు ఏజెన్సీల కే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు శుక్రవారం నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. రీ ఇంజనీరింగ్‌కు ముందు టన్నెల్‌ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు.
అయితే టన్నెల్ తవ్వకాలవల్ల పక్కనే ఉన్న రామప్ప దేవాలయానికి పగుళ్లు ఏర్పడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో టన్నెల్‌కు బదులు ‘3 మీటర్ డయామీటర్’తో మూడు వరుస పైప్‌లైన్‌లను భీమ్‌ఘన్‌పూర్ చెరువు నుంచి రామప్ప చెరువు వరకు వేయాలని నిర్ణయించారు. దీనికి గానూ భీమ్‌ఘన్‌పూర్ వద్ద పంప్‌హౌజ్, సర్జ్‌పూల్ వ్యవస్థ, రామప్ప చెరువు వద్ద పనులు చేపట్టేందుకు మొత్తంగా రూ.1,154.22కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఈ పనులను దక్కించుకున్న కోస్టల్–పటేల్–జ్యోతి కన్సార్షి యం 2015–16 ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో పనులు చేసేందుకు ముందుకు రావడంతో రూ.1,101.15కోట్లతో ఈ పనులను వారికే అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శనిగరానికి రూ.22.72 కోట్లు
సిద్దిపేట జిల్లాలోని శనిగరం మధ్యతరహా ప్రాజెక్టును ఆధునీకరిం చేందుకు రూ.22.72 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్యామ్ భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని ఇటీవల అక్కడ పర్యటించి వచ్చిన ఈఎన్‌సీ ప్రభుత్వానికి సూచించారు. ఈఎన్‌సీ సిఫార్సుల మేరకు ఆధునికీకరణకోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.