greyhounds police
-
భారీ ఎన్కౌంటర్: మహిళా మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మృతి
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుర్నవల్లి, పెసరపాడు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులకు పోలీసులకు రాత్రి నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మావోయిస్టుల మృతదేహాల తరలింపుపై డైలామా కొనసాగుతోంది. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించాలా..లేక వరంగల్ ఎంజీఎంకు తరలించాలా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. చదవండి: హైదరాబాద్‌లో అమానుషం: అన్నను కొట్టి చంపిన తమ్ముడు -
గాలం వేసి కాపుకాచి.. భద్రత దళాలకు భారీదెబ్బ!
హైదరాబాద్: మావోయిస్టులు భద్రతా బలగాలను మరోసారి భారీ దెబ్బకొట్టారు. బలిమెల దాడుల తరహాలో దాదాపు పదమూడేళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రతీకార దాడికి దిగారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య శనివారం నాడు ఐదుగురుగా ఉండగా.. ఆదివారం 23కు చేరింది. గతంలో 2008లో బలిమెల రిజర్వాయర్‌లో కూంబింగ్ కోసం వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులను, 2010 వేసవిలో రెండు ఘటనల్లో 100 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని, 2013లో బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలను చంపేసిన మావోయిస్టులు.. ఆ తర్వాత చేసిన అతి పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. దండ కారణ్యంలో తమకు ఇంకా పట్టు మిగిలే ఉందని చాటేందుకే అధునాతన ఆయుధాలతో అంబుష్ (ఎరవేసి చుట్టుముట్టి దాడి చేయడం) దాడికి పాల్పడ్డారని, అందుకే మృతుల సంఖ్య భారీగా ఉందని ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కొంతకాలంగా దండకారణ్యంలో జరుగుతున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో.. సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్ పెంచారు. ఈ క్రమంలోనే పీఎల్జీఏ కమాండర్ హిడ్మా ఉన్నాడంటూ కావాలని ఉప్పందించిన మావోలు.. వారు ముందుగానే సిద్ధంగా ఉన్న ప్రాంతానికి భద్రతా బలగాలు రావడంతో ఒక్కసారిగా చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. బీజాపూర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ ఆఫీసు నుంచి స్వస్థలాలకు మృతదేహాలను తరలిస్తున్న జవాన్లు ఇంతగా ప్రాణనష్టం ఎందుకు? తెర్రం దాడి ఘటనలో పోలీసుల వైపు ఇంత భారీగా ప్రాణనష్టం ఎందుకు జరిగిందన్న దానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ సంఖ్యలో ఒకేసారి వెళ్లడం, అప్పటికే మావోయిస్టులు ఎత్తుగా ఉన్న గుట్టలపై అప్పటికే పొంచి ఉండటం, ఆకస్మికంగా దాడి చేయడం, అత్యాధునిక ఆయుధాలు వాడటం వంటివి ప్రధాన కారణమని కొందరు పోలీసులు చెప్తున్నారు. ఎత్తులో ఉన్న వారికి ప్రత్యర్థులు అడవిలో చెట్లు, రాళ్ల మధ్య దాక్కున్న సులువుగా గుర్తించే వీలు చిక్కుతుందని.. అందుకే మావోలు నేరుగా పోలీసులను గురిపెట్టి కాల్చారని అంటున్నారు. మావోయిస్టులు ఆధునిక రాకెట్ లాంచర్లు వాడటంతో నేరుగా సిబ్బందిని తాకాయని.. క్షణాల్లో జరిగిన అంబుష్‌లో తప్పించుకునే వీల్లేక ఎక్కువ మంది పోలీసులు బలయ్యారని చెప్తున్నారు. అచ్చంగా 2008లో బలిమెల తరహాలోనే ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరపడంతో మృతుల సంఖ్య పెరిగింది. 2వేల మంది ఒక్కసారిగా వెళ్లడం వైఫల్యమే.. తెర్రం దాడిలో భద్రతా దళాల నిర్లక్ష్యం, రక్షణ చర్యలను విస్మరించడం కూడా అత్యధిక ప్రాణనష్టానికి దారితీశాయని తెలంగాణకు చెందిన పలువురు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మార్చి 24న మావోయిస్టు కమాండర్ హిడ్మా ఉన్నాడంటూ మావోయిస్టులే.. చత్తీస్ఘడ్ భద్రతా దళాలకు వ్యూహాత్మకంగా సమాచారమిచ్చి రప్పించారని ఇప్పుడు పోలీసులకు అర్థమైంది. ఆ సమాచారం ఆధారంగానే.. 2వేల మందికిపైగా భద్రతా దళాలతో పదిరోజులుగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సరిగ్గా ఇక్కడే తెలంగాణ పోలీసులకు– చత్తీస్‌గఢ్ పోలీసులకు స్పష్టమైన తేడా కనిపించింది. మామూలుగా ఎవరైనా మావోయిస్టు లీడర్ ఉన్నాడంటూ సమాచారం వస్తే.. తెలంగాణ పోలీసులు ముందుగా కొందరు సభ్యులతో ఓ టీమును పంపుతారు. వారు ఇచ్చిన సమాచారంతో తర్వాతి టీం బయల్దేరుతుంది. ఒకవేళ ముందు వెళ్లిన టీం ఆపదలో చిక్కుకున్నా.. తర్వాతి టీం ఆగమాగంగా వెళ్లదు. ఎందుకంటే మావోయిస్టులు దాడి చేసినప్పుడు కొందరిని చంపకుండా వదిలేయడం, వారిని కాపాడేందుకు వచ్చిన ఇతర దళాలపై దాడి చేయడం వంటి వ్యూహాలు అమలు చేస్తారు. అందుకే తెలంగాణ పోలీసులు అదనపు బలగాల్ని పంపాల్సి వస్తే.. మొదటి దళం వెళ్లిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళతారు. ఘటనాస్థలాన్ని మూడు వైపులా చుట్టుముడతారు. అయితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో 2113 మందికిపైగా సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో హిడ్మాను వెదుకుతూ వెళ్లారు. తాము ఉచ్చులో పడ్డామన్న సంగతి దాడి మొదలయ్యేంత వరకూ గ్రహించలేకపోయారు. ఇక బుల్లెట్ గాయాల వల్ల తీవ్రంగా రక్తస్రావం కావడం, మండుతున్న ఎండ కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బతో పోలీసుల మరణాలు పెరిగాయని వైద్యులు చెప్పారు. పొగలు చూసి వెళ్లారా? తెర్రం ప్రాంత గుట్టలపై బాగా పట్టున్న మావోలు.. హిడ్మా అక్కడే ఉన్నాడని పోలీసులు నమ్మేలా చేశారు. డ్రోన్లతో వెళ్లిన పోలీసు లకు.. దూరంగా ఎత్తయిన ప్రాంతానికి సమీ పంలో పొగలు కనిపించాయి. హిడ్మా అక్కడే దళం తో ఉన్నాడని, అక్కడ వంటలు చేసుకుంటున్నారని పొరబడి వెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ కొండలు, ఒక పక్కన పలుచగా అడవి, కొంత మైదానం లా ఉన్న ప్రాంతానికి భద్రతాదళాలు వచ్చేలా చేయడంలో మావోలు సఫలీకృతమయ్యారు. గతంలో జరిగిన భారీ దాడులు! 2008 జూన్ 29: బలిమెల ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని బలిమెల రిజర్వాయర్‌లో పడవల్లో కూంబింగ్‌కు వెళ్తున్న గ్రేహౌండ్స్ పోలీసులపై.. గుట్టలపై నక్కి ఉన్న మావోయిస్టులు దాడి చేశారు. పడవల్లో ఉన్న 60 మంది పోలీసులు రిజర్వాయర్‌లో దూకి ఒడ్డుకు వచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఊచకోతలో మొత్తం 38 మంది పోలీసులు చనిపోయారు. 2010 ఏప్రిల్ 6: చింతల్నార్ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా చింతల్నార్ అటవీ ప్రాంతంలో 200 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌పై.. దాదాపు 300 మందికిపైగా మావోయిస్టులు అకస్మాత్తు దాడికి దిగారు. ఆ దాడిలో 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మరణించారు. బాంబులు విసురుతూ, కాల్పులు జరిపిన మావోయిస్టులు.. గాయపడ్డ వారిని కత్తులతో పొడిచారు. ఒక సీఆర్పీఎఫ్ జవాను శరీరంపై 78 కత్తిపోట్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఇక సీఆర్పీఎఫ్ జరిపిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. 2010 మే 17: బస్సుపై దాడి 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన నెలన్నర రోజుల్లోనే మావోయిస్టులు.. మరోసారి పాశవిక దాడికి దిగారు. మావోయిస్టులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో సీఆర్పీఎఫ్, ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్)లు బస్సులో సాధారణ ప్రజలతో కలిసి ప్రయాణిస్తుండగా.. మావోయిస్టులు ఆ బస్సును పేల్చివేశారు. బస్సులో ఉన్నవారిలో 44 మంది చనిపోగా.. ఆరుగురే బతికారు. మృతుల్లో 18 మంది ఎస్పీవోలు కాగా, మిగిలినవారిలో సీఆర్పీఎఫ్ జవాన్లు, సాధారణ మహిళలు, చిన్నారులు ఉండటం కలచివేసింది. 2013 మే 25: సుక్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన రాజకీయ ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తున్న కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు దాడికి దిగారు. బస్తర్ జిల్లా దర్బాఘాట్ వద్ద చెట్లు నరికి కాన్వాయ్ ను ఆపారు. మొదట ల్యాండ్ మైన్ పేల్చి, తర్వాత ఆపకుండా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మావోయిస్టులపై పోరుకు గిరిజనులతో ‘సల్వాజుడుం’ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ చీఫ్ నందకుమార్ పటేల్, విద్యాచరణ్ శుక్లా, భద్రతా సిబ్బందితో కలిపి మొత్తం 32 మంది చనిపోయారు. -
నలుగురు మావోయిస్టుల అరెస్ట్
అరకులోయ/మల్కన్‌గిరి: ఒడిశా కటాఫ్ ప్రాంతంలోని ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో పట్టుబడిన నలుగురు మావోయిస్టుల నుంచి పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ ముగ్గురు మహిళా మావోయిస్టులు, ఓ మిలీషియా సభ్యుడి ఫోటోలను మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గా మోహన్ మిన్నా శనివారం మీడియాకు వెల్లడించారు. ఆండ్రపల్లి గ్రామానికి చెందిన మిలీషియా సభ్యుడిగా పనిచేస్తున్న రాజశేఖరకర్మతో పాటు జంత్రి గ్రామానికి చెందిన పార్టీ సభ్యులు జయంతి గొల్లూరి (20), రాధిక (20), సుమ గొల్లూరి (17)గా పోలీసులు గుర్తించారు. వారి కిట్ బ్యాగ్‌ల నుంచి 3 జిలెటిన్లు, 2 క్రోడాక్స్, వైరు, 2 టిపెన్‌బాక్స్ బాంబులు, ఎలక్ట్రీకల్ వైరును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. గాయాలపాలైన పోలీసులకు పాడేరులో చికిత్స కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టు మీనా మృతదేహంతోపాటు, పట్టుబడిన మావోయిస్టులను గ్రేహౌండ్స్ పోలీసులు తరలిస్తున్న సమయంలో కొంతమంది గిరిజనులు అడ్డుకుని పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పలువురు గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివచ్చారు. గాయపడిన 11 మంది గ్రేహౌండ్స్ పోలీసులకు పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు నిడి గొండ ప్రమీల ఉరఫ్ మీనా మృతదేహాన్ని శనివారం ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. -
నల్లమలలో గ్రేహౌండ్స్
విశాఖ మన్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యతో నల్లమల అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల అలజడి లేదని చేసిన పోలీసుల ప్రకటనతో మారుమూల గ్రామాలకు వెళ్లి ఉన్న ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా తమ పంథా మార్చుకున్నారు. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యతో పాటు తెలంగాణ పరిధిలో మావోల మూవ్మెంట్ ఉండటంతో నల్లమలను షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకునే అవకాశాలపై పోలీసులు దృష్టి సారించారు. మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడు గ్రేహౌండ్స్ బూట్ల చప్పుళ్లతో మార్మోగుతోంది. ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దించాయి. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు విశాఖ మన్యంలోలా యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దించి టార్గెట్లపై దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటన్న అంశంపై పోలీస్ అధికారులు దృష్టి సారించారు. గతంలో మావోల టార్గెట్‌లో ఉన్న నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కదలికలపై ఎస్పీ సత్య ఏసుబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మార్కాపురం డివిజన్లోని ప్రజాప్రతినిధుల భద్రతపై డీఎస్పీ రామాంజనేయులు సమీక్ష చేసి గన్మెన్లు, పీఏలకు పలు సూచనలు చేశారు. తమ అనుమతి లేకుండా గ్రామాలకు వెళ్లవద్దని, గ్రామ దర్శినితో పాటు పార్టీ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు తమకు సమాచారం అందించాలని, తాము కల్పించే భద్రతతో వెళ్లాలని చెప్పారు. అనుమానిత వ్యక్తులను ఎమ్మెల్యేల వద్దకు రానివ్వద్దని గన్మెన్లకు సూచించారు. మావోయిస్టు సానుభూతిపరులు, లొంగిపోయిన వారిపై కూడా నిఘా పెట్టారు. గతంలో మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన పెద్ద దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, అర్ధవీడు, గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని యడవల్లి, గంటవానిపల్లె, చిలకచర్ల, కొత్తూరు, నల్లగుంట్ల, బంధంబావి, చినారుట్ల, పెదారుట్ల, బైర్లూటి, తుమ్మలబైలు, పాలుట్ల, శతకోడు, అక్కచెరువు, గంజివారిపల్లె, గన్నేపల్లి, వెలగలపాయ, బొమ్మిలింగం, కాకర్ల, దిగువమెట్ట, జల్లి వారి పుల్లలచెరువు తదితర గ్రామాలపై పోలీసులు దృష్టి పెట్టారు. గతంలో ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల ఎన్కౌంటర్లు, ఎదురు కాల్పులు జరగటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురంలో బేస్ క్యాంప్ ఏర్పాటు నల్లమలలో గతంలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడ చనిపోయారు. అప్పట్లో గ్రేహౌండ్స్ పార్టీని మార్కాపురంలో ఏర్పాటు చేశారు. అయితే గత మూడు, నాలుగేళ్ల నుంచి మావోల కదలికలు లేకపోవటంతో గ్రేహౌండ్స్ దళాల బేస్ క్యాంప్‌లు తరలించారు. కాగా, మళ్లీ మావోయిస్టుల యాక్షన్ టీం రంగంలోకి రావడంతో అప్రమత్తమైన పోలీసులు మార్కాపురంలోని స్పెషల్ పార్టీ పోలీసులతో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఇదీలా ఉండగా తెలంగాణ ప్రాంతం నుంచి, ఏఓబీ నుంచి మావోయిస్టులు నల్లమలకు షెల్టర్‌గా ఉపయోగించుకునే అవకాశాలు ఉండటంతో గ్రేహౌండ్స్ దళాల కూంబింగ్‌తో పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాల, గుంటూరు జిల్లా నరసరావుపేట, గురజాల పోలీస్ అధికారులతో స్థానిక డీఎస్పీ రామాంజనేయులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుని సమీక్షించుకుంటున్నారు. గతంలో మావోయిస్టుల ఉద్యమం ఉన్నప్పుడు మార్కాపురం డివిజన్లో పనిచేసిన పోలీస్ అధికారుల సూచనలు, అనుభవాలను విశ్లేషించుకుంటున్నారు. పోలీస్ అధికారులు కూడ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రజాప్రతినిధులకు సూచనలు మార్కాపురం డివిజన్లోని ప్రజాప్రతినిధులు, గన్మెన్లకు, పీఏలకు పలు సూచనలు చేసినట్లు రామాంజనేయులు తెలిపారు. మావోయిస్టుల బలపడకుండా, ప్రజలు వారి వైపు ఆకర్షితులు కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీశాఖ, ఐటీడీఏ సిబ్బంది సహకారం కూడ తాము తీసుకుంటున్నామని తెలిపారు. మారుమూల గ్రామాలకు వెళ్లే ప్రజాప్రతినిధులు సమీపంలోని ఎస్సైలకు సమాచారం అందించకుండ వెళ్లకూడదని స్పష్టం చేశారు. –డీఎస్పీ రామాంజనేయులు -
స్పెషల్ పీపీగా రాజేంద్ర ప్రసాద్ ఓకే
సాక్షి, హైదరాబాద్: గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన కేసులో కింది కోర్టులో వాదనలు వినిపించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విజయవాడకు చెందిన సుంకర రాజేంద్రప్రసాద్ నియామకానికి బాధిత గిరిజన మహిళలు మొగ్గు చూపారు. హైకోర్టు రూపొందించిన ఆరుగురు ప్రముఖ క్రిమినల్ లాయర్ల జాబితా నుంచి సుంకర రాజేంద్రప్రసాద్‌ను ఎంపిక చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ను స్పెషల్ పీపీగా నియమించవచ్చునని బాధిత మహిళల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. రాజేంద్రప్రసాద్ నియామకం పట్ల ప్రభుత్వ న్యాయవాది సైతం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో స్పెషల్ పీపీ నియామకం విషయంలో రాజేంద్రప్రసాద్ అంగీకారం తెలుసుకోవాలని రిజిస్ట్రా్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఫీజుపై కూడా స్పష్టత తీసుకోవాలని రిజిస్ట్రా్టర్ జనరల్‌కు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచార కేసు..
సాక్షి, హైదరాబాద్: విశాఖ జిల్లా వాకపల్లిలో గిరిజన మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేశారన్న ఆరోపణల కేసులో బాధితుల తరఫున వాదించే నిమిత్తం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం ఎంపిక చేసిన న్యాయవాదుల జాబితా గురువారం హైకోర్టుకు అందింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సిద్ధం చేసిన జాబితాలో క్రిమినల్ కేసుల విచారణలో బాగా అనుభవం ఉన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, విశాఖలో ప్రాక్టీస్ చేస్తున్న కేవీ రామమూర్తి, డి.శ్రీనివాస్‌రెడ్డి (ఒంగోలు) సుంకర రాజేంద్రప్రసాద్ (విజయవాడ), జీఎం విజయకుమార్ (సికింద్రాబాద్) హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఈ.ఉమామహేశ్వరరావు, వి.సురేంద్రరావుల పేర్లు జాబితాలో ఉన్నాయి. జాబితాను గురువారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఏడు పేర్లతో ఉన్న జాబితాలోని వారిని ప్రాధాన్యత క్రమంలో సంప్రదించి వారిలో అంగీకారం తెలిపిన ముగ్గురి పేర్లను తమకు తెలియజేయాలని బాధిత గిరిజన మహిళల తరఫు న్యాయవాది వసుదా నాగరాజ్‌కు ధర్మాసనం సూచన చేసింది. విచారణ శుక్రవారం (నేడు) వాయిదా పడింది. 2007లో కూబింగ్‌కు వచ్చిన గ్రేహౌండ్స్ పోలీసులు తమపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ గిరిజన మహిళలు దాఖలు చేసిన కేసు విశాఖ జిల్లా ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల విచారణ కోర్టులో ఉంది. పౌరహక్కుల ఉద్యమ నేత పల్లా త్రినాథరావును తమ తరఫున వాదించేందుకు నియమించాలని బాధితుల అభ్యర్థనను సింగిల్ జడ్జి ఆమోదించారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేయడంతో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం కోసం ధర్మాసనం కసరత్తు చేసే క్రమంలో ఏడుగురి పేర్ల జాబితాను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సమర్పించారు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. -
సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసులపై అనుమానాలు
-
సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసులపై అనుమానాలు
హైదరాబాద్: కేబీఆర్ పార్కు కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. గతంలో ఏకే-47 తుపాకీ కనిపించకుండాపోయిన కేసులో ఏడుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దుండగుడు వదిలేసిన ఆయుధం ఫిబ్రవరి 3న గ్రేహౌండ్స్ పోలీసుల నుంచి మిస్సైన తుపాకీగా గుర్తించారు. దీనిపై నార్సింగ్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదైందని పోలీసులు తెలిపారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆగంతకుడు ట్రాక్ షూట్, తెలుగు రంగు టీషర్టు ధరించినట్టు పోలీసులు గుర్తించారు.