Tamil Nadu cabinet
-
కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన తండ్రి కేబినెట్లోకి అడుగుపెట్టారు ఉదయనిధి. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా.. 2021లో చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యువజన విభాంగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఎంకే స్టాలిన్ సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. ఆ తర్వాత మాజీ సీఎం ఎం కరుణానిధి మరణానంతరం 2018లో డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో యూత్ వింగ్ బాధ్యతలను ఉదయనిధికి 2019లో అప్పగించారు. ఇదీ చదవండి: Sarathkumar: రమ్మీ నాలెడ్జ్ గేమ్!.. నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు -
Udhayanidhi Stalin: స్టాలిన్ వారసుడు ఇక మంత్రిగా..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, అధికార డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి(45)కి త్వరలో∙మంత్రి యోగం దక్కనుంది. 14న రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఉదయనిధి మంత్రిగా ప్రమాణం చేయనున్నారని సోమవారం రాజ్‌భవన్ తెలిపింది. మంత్రివర్గంలోకి ఉదయనిధిని తీసుకోవాలంటూ డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసును గవర్నర్ రవి ఆమోదించారని పేర్కొంది. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో చెపాక్–తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఉదయనిధికి మంత్రి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ పార్టీ వర్గాలతోపాటు మంత్రుల నుంచి ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తోందని డీఎంకే నేతలు అంటున్నారు. -
క్యాబినెట్ అత్యవసర భేటీ: 'డిప్యూటీ సీఎం'పై చర్చ
-
కేబినెట్ అత్యవసర భేటీ: 'డిప్యూటీ సీఎం'పై చర్చ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని డాక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో పరిపాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యతను డిప్యూటీ సీఎంకు అప్పగించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు జయ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రిలోనే శుక్రవారం సాయంత్రం కేబినెట్ అత్యవసరంగా భేటీ అయింది. ఇప్పటివరకు తమిళనాడుకు డిప్యూటీ సీఎం లేనందున కొత్తగా పదవి ఏర్పాటుచేసేలా మంత్రులు.. గవర్నర్ తో చర్చలు జరుపుతున్నారు. పైగా తమిళనాడులో కొందరు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడటం, రాష్ట్రంలోని పరిస్థితులను అవకాశంగా తీసుకుని సంఘవిద్రోహ శక్తులు రెచ్చిపోయే అవకాశాలుండటం తదితర అంశాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తమిళనాడుకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎవరో ఒకరు ప్రభుత్వానికి సారథ్యం వహించాల్సిన అవసరం ఏర్పడింది. కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి ఇన్ చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వివరించడంతోపాటు డిప్యూటీ సీఎం నియామకంపైనా సెల్వం.. గవర్నర్ తో చర్చించారు. కాగా ఇప్పటికున్న సమాచారం మేరకు డిప్యూటీ సీఎం రేసులో పన్నీర్ సెల్వంతోపాటు సీనియర్ మంత్రి పళని స్వామి కూడా ఉన్నారు. గడిచిన 15 రోజులుగా సీఎం జయలలిత ఆసుపత్రికే పరిమితమైపోవడంతో పరిపాలనా పరమైన ఆదేశాల జారీలో ఆలస్యం నెలకొంటున్నది. జయకు అత్యంత ఆప్తుడైన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావే అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అయితే రాజ్యాంగ పరంగా ఆయన పాత్రకు కొన్ని పరిమితులుంటాయి. జయ పదవిలోనే ఉన్నందున 'తాత్కాలిక సీఎం' అంశానికే తావులేదు. దీంతో పూర్తిస్థాయిలో పరిపాలన గాడిలో పెట్టేందుకుగానూ డిప్యూటీ సీఎం ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు కేబినెట్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
మళ్లీ మార్పు!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మంత్రి వర్గంలో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మంత్రుల పనితీరు సక్రమంగా లేకున్నా, అవినీతి ఆరోపణలు ఎదురైనా, ఫిర్యాదులు వెల్లువెత్తినా వారిని ఇంటికి పంపడానికి జయ ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఆ దిశగా రెండున్నరేళ్లలో పదమూడో సారి మంత్రి వర్గం లో మార్పులు చోటుచేసుకున్నాయి. మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో ముఖ్యమంత్రి జయలలితతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సగం మందికి పైగా ఇప్పుడు పదవుల్లో లేరు. ఇందులో జయలలిత నమ్మిన బంటులూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ తప్పులు చేసిన వారిపై ఏ మేరకు జయలలిత కొరడా ఝుళిపిస్తున్నారో స్పష్టం అవుతోన్నది. రామలింగం అవుట్ ఇటీవల జరిగిన మార్పుల్లో ఇసుక కుంభకోణం దెబ్బకు కీలకమైన ప్రజాపనుల శాఖ నుంచి ప్రాధాన్యత లేని క్రీడల శాఖలో పడిన మంత్రి కేవీ రామలింగానికి పదవీ గండం తప్పలేదు. ఇసుక కుంబకోణం ఓ వైపు, అన్నదాత ముత్తుస్వామి కిడ్నాప్, స్థల కబ్జా ఫిర్యాదు మరో వైపు ఆయన్ను వెంటాడాయి. దీంతో రెండు రోజుల క్రితం ఈరోడ్ అర్బన్ జిల్లా పార్టీ కార్యదర్శి పదవి నుంచి రామలింగాన్ని తొలగించారు. ఆయనకు ఆ పదవి దూరం అయిందో లేదో, ఇక మంత్రి పదవి సైతం ఊడినట్టేనన్న ప్రచారం ఊపందుకుంది. ఊహించినట్టుగానే ప్రస్తుత మార్పుల్లో మంత్రి పదవి నుంచి రామలింగానికి ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో సాత్తూరు ఎమ్మెల్యే ఆర్బి ఉదయకుమార్‌కు చోటు కల్పించారు. ఇవి మార్పులు తన మంత్రి వర్గంలో మార్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత చేసిన సిఫారసుకు గవర్నర్ రోశయ్య స్పందించారు. ఆమోదముద్ర వేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు క్రీడల శాఖ మంత్రి కేవి రామలింగంకు ఉద్వాసన పలికారు. సాత్తూరు ఎమ్మెల్యే ఆర్బి ఉదయకుమార్‌కు చోటు కల్పించారు. క్రీడల శాఖ పదవిని ఆర్బి ఉదయకుమార్‌కు అప్పగించగా, మరో ముగ్గురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగాయి. బివి రమణ వద్ద ఉన్న వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖను ఎంసి సంపత్‌కు మార్చారు. ఎంసీ సంపత్ వద్ద ఉన్న పర్యావరణ శాఖను ఎన్డి వెంకటాచలంకు, ఆయన వద్ద ఉన్న రెవెన్యూ శాఖను బివి రమణకు కేటాయించారు. బుధవారం ఉదయం రాజ్ భవన్లో జరిగే కార్యక్రమంలో ఆర్బి ఉదయకుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవీ రామలింగానికి ఉద్వాసన పలకడం, ముగ్గురి శాఖల్లో మార్పులు జరగడంతో అన్నాడీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మంత్రుల శాఖల్లో మార్పులు జరిగిన పక్షంలో, వారికి త్వరలో పదవీ గండం ఉన్నట్టేనా? అన్న గత అనుభవాల్ని గుర్తు చేసుకుంటుండటం గమనార్హం. అలాగే, ఆర్ బి ఉదయకుమార్ ఇది వరకు జయలలిత కెబినెట్లో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయనకు గతంలో ఉద్వాసన పలికి, తాజాగా మళ్లీ అవకాశం ఇవ్వడంతో జయలలిత నమ్మిన బంటుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.