
సీఎం జయ అధ్యక్షతన కేబినెట్ భేటీ(ఫైల్ ఫొటో)
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని డాక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో పరిపాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యతను డిప్యూటీ సీఎంకు అప్పగించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు జయ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రిలోనే శుక్రవారం సాయంత్రం కేబినెట్ అత్యవసరంగా భేటీ అయింది.
ఇప్పటివరకు తమిళనాడుకు డిప్యూటీ సీఎం లేనందున కొత్తగా పదవి ఏర్పాటుచేసేలా మంత్రులు.. గవర్నర్ తో చర్చలు జరుపుతున్నారు. పైగా తమిళనాడులో కొందరు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడటం, రాష్ట్రంలోని పరిస్థితులను అవకాశంగా తీసుకుని సంఘవిద్రోహ శక్తులు రెచ్చిపోయే అవకాశాలుండటం తదితర అంశాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తమిళనాడుకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎవరో ఒకరు ప్రభుత్వానికి సారథ్యం వహించాల్సిన అవసరం ఏర్పడింది.
కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి ఇన్ చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వివరించడంతోపాటు డిప్యూటీ సీఎం నియామకంపైనా సెల్వం.. గవర్నర్ తో చర్చించారు. కాగా ఇప్పటికున్న సమాచారం మేరకు డిప్యూటీ సీఎం రేసులో పన్నీర్ సెల్వంతోపాటు సీనియర్ మంత్రి పళని స్వామి కూడా ఉన్నారు. గడిచిన 15 రోజులుగా సీఎం జయలలిత ఆసుపత్రికే పరిమితమైపోవడంతో పరిపాలనా పరమైన ఆదేశాల జారీలో ఆలస్యం నెలకొంటున్నది. జయకు అత్యంత ఆప్తుడైన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావే అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
అయితే రాజ్యాంగ పరంగా ఆయన పాత్రకు కొన్ని పరిమితులుంటాయి. జయ పదవిలోనే ఉన్నందున 'తాత్కాలిక సీఎం' అంశానికే తావులేదు. దీంతో పూర్తిస్థాయిలో పరిపాలన గాడిలో పెట్టేందుకుగానూ డిప్యూటీ సీఎం ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు కేబినెట్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.