అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే..
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండగా.. అన్నా డీఎంకే చీఫ్ శశికళ వర్గానికి షాకుల మీద షాకులతో ఆందోళన కలిగిస్తోంది. శశికళ పేరు వింటనే జయలలిత బంధువులు మండిపడుతుండగా.. అమ్మ చిన్ననాటి స్నేహితుల నుంచి కూడా ఆమెకు మద్దతు కరువైంది. అమ్మ చిన్ననాటి స్నేహితులు, క్లాస్మేట్స్.. శశికళను కాదని పన్నీరు సెల్వంకు మద్దతు ప్రకటించిడం విశేషం. సెల్వంపై జయలలితకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారని చెబుతున్నారు. అన్నా డీఎంకేలో ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులు బాధాకరమని అన్నారు.
జయలలిత పన్నీరు సెల్వం వంటి వారిని రాజకీయ వారసుడిగా ప్రకటించి ఉండాల్సిందని ఆమె స్నేహితురాలు శ్రీమతి అయ్యంగార్ అభిప్రాయపడ్డారు. జయలలితకు చిన్ననాటి స్నేహితులను శశికళ దూరం చేసిందని, ఆమెను కలవనీయకుండా చేసిందని చాందిని పంకజ్ బులానీ చెప్పారు. ఆమె ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. తాను డెలివరీ అయినపుడు జయలలిత ఆస్పత్రికి వచ్చి పరామర్శించారని, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయానని చెప్పారు. కనీసం జయలలితను చూసే అవకాశం కూడా తమకు శశికళ ఇవ్వలేదని ఆరోపించారు. ఓసారి జయలలితను కలిసేందుకు పన్నీరు సెల్వం అపాయింట్‌మెంట్ ఇచ్చారని, అయితే శశికళ మనుషులు తమను అడ్డుకున్నారని చెప్పారు. తమ స్నేహితులెవరూ జయలలితను కలవకుండా శశికళ దూరం చేశారని మండిపడ్డారు. పన్నీరు సెల్వం చాలా గౌరవనీయ వ్యక్తని, చివరిసారి జయలలితతో కలసి తాము భోజనం చేసినపుడు ఆయన అక్కడే ఉన్నారని చెప్పారు. జయలలిత ఆశయాలను పన్నీరు సెల్వం నెరవేరుస్తారనే నమ్మకముందని బాదర్ సయీద్ చెప్పారు. తొలుత అన్నాడీఎంకేలో పనిచేసిన సయీద్ తర్వాత ఆప్‌లో చేరారు.
సంబంధిత వార్తలు చదవండి
గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు?
పన్నీర్కే 95 శాతం మద్దతు!
గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఎత్తుకు పైఎత్తు
నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం