ఇట్స్ క్లియర్: చిన్నమ్మే సీఎం..!!
- వెంటనే పగ్గాలు చేపట్టాల్సిందిగా అన్నాడీఎంకే అధికారిక విజ్ఞప్తి
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి విషయంలో అన్నాడీఎంకే స్పష్టత ఇచ్చింది. అమ్మ జయలలిత స్థానంలో చిన్నమ్మ శశికళ నటరాజన్ వెంటనే సీఎం పదవిని చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. జయలలిత చేపట్టిన అభివృద్ధి పథకాలను కార్యక్రమాలను ముందుకుతీసుకుపోవడానికి చిన్నమ్మే సరైన వ్యక్తి అని పేర్కొంది. ఈ మేరకు నాలుగు పేజీల అధికారిక ప్రకటనను అన్నాడీఎంకే సోమవారం విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై ఈ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.
తమిళనాడు అభివృద్ధికి, ప్రగతికి పార్టీ, ప్రభుత్వం పగ్గాలు ఒకే వ్యక్తి చేతిలో ఉండటం కీలకమని తాము భావిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. జయలలిత మరణానంతరం ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, కొన్నిరోజుల కిందటే అన్నాడీఎంకే అధినేత్రిగా శశికళ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమెను సీఎం పీఠం మీద కూర్చోవాల్సిందిగా పార్టీ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో శశికళ ఏ నిర్ణయం తీసుకుంటారు? జయలలిత వదిలివెళ్లిన సీఎం పీఠం మీద కూర్చోవడానికి ఆమె సిద్ధపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.