పన్నీర్ పదవికి స్పాట్ పెట్టిన మంత్రులు
- శశికళకే సీఎం పగ్గాలు ఇవ్వాలని డిమాండ్
- ముఖ్యమంత్రి మార్పునకు రంగం సిద్ధం!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మీద శశికళ నటరాజన్‌ను కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. పన్నీర్ సెల్వాన్ని తొలగించి ఆయన స్థానంలో శశికళను సీఎం చేయాలన్న డిమాండ్ రోజురోజుకు ఊపందుకుంటోంది. తాజాగా ఐదుగురు మంత్రులు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం గమనార్హం. అమ్మ జయలలిత మరణం తర్వాత ఆమె స్థానంలో అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ పదవిని చేపట్టడంతో.. ఇదే అదనుగా ఆమెకే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కట్టబెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.
కొత్త సంవత్సరం సందర్భంగా రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ సమాచార శాఖ మంత్రి కడంబూరు రాజు, దేవాదాయ శాఖమంత్రి సెవ్వూరు ఎస్ రామచంద్రన్, టెక్స్‌టైల్స్ మంత్రి ఓఎస్ మణి, విద్యుత్ శాఖ మంత్రి తంగమణి వేర్వేరుగా మెరీనా తీరంలోని జయలలిత సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూడా శశికళే నడుపాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మంత్రులు కదంబూర్ రాజు, ఎండోమెంట్ మంత్రి సెవ్వూర్ ఎస్ రామచంద్రన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన అన్నాడీఎంకే పార్టీ ఏర్పడిన నాటి నుంచి పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పదవిని ఒకే వ్యక్తి నిర్వహించారని, ఇప్పుడు కూడా అదే సంప్రదాయం కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.
మిగతా మంత్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మే తమ సీఎం అంటూ స్పష్టం చేశారు. జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్ లేదా ఇతర స్థానం నుంచి చిన్నమ్మ పోటీచేసే అవకాశముందని, అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన సందర్భంగా చిన్నమ్మ చేసిన ప్రసంగం పార్టీ వర్గాల్నే కాదు యావత్ ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసిందని మంత్రి ఓఎస్ మణి అన్నారు.
ఇలా ఏకంగా ఐదుగురు కీలక మంత్రులు జయలలిత నెచ్చెలి శశికళే సీఎం పగ్గాలు చేపట్టాలని డిమాండ్ చేయడంతో పన్నీర్ సెల్వానికి ఇక పదవీ గండం తప్పకపోవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టే విషయంలో శశికళ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం పదవి విషయంలోనూ ఆమె అదే చతురత ప్రదర్శించే అవకాశముందని నిపుణులు అంటున్నారు. సీఎం పదవి మార్పు విషయంలో అన్నాడీఎంకే అధినాయకత్వం మౌనంగా ఉంటూ.. మంత్రులతో ఇలాంటి ప్రకటనలు చేయించడం ద్వారా తన అభీష్టాన్ని చాటుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.
మంత్రులు ఇలాంటి ప్రకటనలు చేయడం పన్నీర్ సెల్వం నాయకత్వాన్ని బహిరంగంగా సవాలు చేయడమేనని, దీనిని కావాలంటే అన్నాడీఎంకే నాయకత్వం కట్టడి చేయవచ్చు కానీ, అలా చేయడం లేదంటే.. దీనిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు తమిళనాడులోని రాజకీయాలను నిశితంగా గమనిస్తోందని, మోదీ సర్కార్ అండ ఉంటే తప్ప పన్నీర్ సెల్వాన్ని కుర్చీలోంచి దింపేసి.. శశికళ పగ్గాలు చేపట్టడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.