► త్వరలో పగ్గాలు
► మంత్రుల మనోగతం
► పన్నీరుకు పదవీ గండం తప్పదేమో!
చిన్నమ్మ శశికళ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి తీరుతారంటూ కొత్త సంవత్సరం వేళ ఐదుగురు మంత్రులు ప్రకటించారు. ఆ బాధ్యతలతో ప్రజా సేవకు త్వరలో చిన్నమ్మ అంకితం అవుతారన్న మంత్రుల వ్యాఖ్యలతో సీఎం పన్నీరుకు ఇక, పదవీ గండం తప్పదేమోనన్న చర్చ మొదలైంది.
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలను చిన్నమ్మ శశికళ చేపట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకేను రక్షించడం, అమ్మ ఆశయ సాధన, కార్యకర్తల అభీష్టం, నాయకుల వేడుకోలు మేరకు తాను ప్రధాన కార్యదర్శి పగ్గాలను చేపట్టినట్టు శశికళ ప్రకటించి ఉన్నారు. ఆమె తొలి ప్రసంగం ఉద్వేగ భరితంగానే సాగింది. ఆ ప్రసంగం కొత్త ఉత్సాహాన్ని నింపినట్టుగా అన్నాడీఎంకే వర్గాలు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కేడర్ మనసును తాకే రీతిలో సాగిన ఈ ప్రసంగాన్ని ఆసరాగా చేసుకుని, త్వరలో కోట్లాది మంది తమిళ ప్రజల మదిలో చోటు దక్కించుకునే విధంగా సీఎం పగ్గాలు చిన్నమ్మ చేపట్టి తీరుతారన్న ధీమాను మంత్రులు కొత్త సంవత్సరం వేళ తమ మనోగతాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ , కొన్ని నెలల వ్యవధిలో సీఎం పగ్గాలు చేపట్టి తీరుతారన్న ధీమాను ఆ మంత్రులు వ్యక్తం చేయడం బట్టి చూస్తే, పన్నీరు మళ్లీ మాజీ అయ్యే అవకాశాలు ఎక్కువే.
చిన్నమ్మే మా సీఎం: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్, సమాచార శాఖ మంత్రి కడంబూరు రాజు, దేవాదాయ శాఖమంత్రి సెవ్వూరు ఎస్ రామచంద్రన్, టెక్స్‌టైల్స్ మంత్రి ఓఎస్ మణి, విద్యుత్ శాఖ మంత్రి తంగమణి వేర్వేరుగా మెరీనా తీరంలోని జయలలిత సమాధిని సందర్శించారు. అమ్మకు నివాళులర్పించినానంతరం మీడియాతో మాట్లాడుతూ తమ సీఎం చిన్నమ్మేనని ధీమా వ్యక్తం చేస్తూ వ్యాఖ్యల్ని అందుకున్నారు. ఆర్‌బీ ఉదయకుమార్ మాట్లాడుతూ అమ్మ జయలలితకు సంధ్యమ్మ జన్మనిచ్చినా, వెన్నంటి నీడలా ఉన్న శశికళకే అమ్మ రాజకీయ వారసత్వం దక్కాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలను చిన్నమ్మ చేపట్టారని, ఇక సీఎం పగ్గాలు చేపట్టే సమయం ఆసన్నమైనట్టేనని తెలిపారు. జాతి, మత బేధాలకు అతీతంగా సుపరిపాలనను చిన్నమ్మ అందిస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు.
అందరి అభీష్టం మేరకు చిన్నమ్మ సీఎం పగ్గాలు త్వరలో చేపట్టి తీరుతారని స్పష్టం చేశారు. మంత్రి కడంబూరు రాజు మాట్లాడుతూ చిన్నమ్మ ప్రసంగాన్ని చూస్తే అందరి హృదయాలు ద్రవించాయని పేర్కొన్నారు. పార్టీ కోసం పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ ప్రజల కోసం సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. సెవ్వూరు ఎస్ రామచంద్రన్ మాట్లాడుతూ అమ్మకు నీడలా సేవలు అందించిన చిన్నమ్మ , ఇక ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో తన సేవల్ని అంకితం చేసే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. మంత్రి ఓఎస్ మణి మాట్లాడుతూ చిన్నమ్మ తొలి ప్రసంగం అన్నాడీఎంకే వర్గాల్నే కాదు, యావత్ రాష్ట్రాన్ని మంత్రముగ్దుల్ని చేసినట్టు పేర్కొన్నారు.
ఆర్‌కే నగర్ నుంచి ఆమె పోటీ చేస్తారా లేదా మరేదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి సీఎం పగ్గాలు చేపడుతారా అన్నవిషయాన్ని త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందన్నారు. పి.తంగమణి పేర్కొంటూ చిన్నమ్మ రూపంలో అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్సాహం రెట్టింపు అయిందని, ఆమె సీఎం పగ్గాలు చేపట్టాల్సిందేనని ఆహ్వానించేందుకు అందరం సిద్ధం అవుతున్నామన్నారు. ఇక మధురైలో సహకార మంత్రి సెల్లూరురాజు మీడియాతో మాట్లాడుతూ కరుణానిధి పన్నిన కుట్రలన్నింటినీ భగ్నం చేసిన ఘనత చిన్నమ్మకే దక్కుతుందన్నారు. అందుకే ప్రధాన ప్రతిపక్షాన్ని ఢీ కొట్టే సమర్థురాలిగా సీఎం పగ్గాలు చేపట్టేందుకు చిన్నమ్మను ఆహ్వానించనున్నామని పేర్కొనడం గమనార్హం. ఐదుగురు మంత్రుల గళం తదుపరి వరుసగా చిన్నమ్మ సీఎం పగ్గాలు చేపట్టాల్సిందేనన్న నినాదం అన్నాడీఎంకేలో మిన్నంటే అవకాశాలు ఎక్కువే. ఇందుకు కారణం ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టే ముందు సాగిన రాజకీయమే.