జయ మృతిపై పెదవి విప్పిన శశికళ!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు ముసురుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ మృతిపై తొలిసారి అన్నాడీఎంకే అధినేత్రి, ఆమె నెచ్చెలి వీకే శశికళ స్పందించారు. సీఎన్‌ఎన్-న్యూస్18 చానెల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ విషయమై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
'అమ్మతో కలిసి నేను 33 ఏళ్లు ఒకే ఇంట్లో నివసించాను. ఆమెను నేను ఎంత బాగా చూసుకున్నానో బాడీగార్డులకు తెలుసు. (జయ మృతిపై) వదంతులు కావాలనే వస్తున్నాయి. ఎవరూ వీటిని సృష్టిస్తున్నారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్న 75 రోజులూ.. నేను ఆమెతోనే ఉన్నాను. ఆమె జాగ్రత్తగా చూసుకున్నాను. వైద్యులు ఇందుకు సాక్షి. నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను. అమ్మ మృతి తర్వాత నేను చాలా బాధ, ఆవేదన అనుభవించాను' అని తెలిపారు.
జయలలిత మృతిపై అనుమానాలు నివృత్తి చేసేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుచేస్తామని ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'పన్నీర్ సెల్వం ప్రకటన నన్ను తీవ్రంగా బాధించింది. మాకు ఎలాంటి భయం లేదు. మేం ఎయిమ్స్ నుంచి, లండన్ నుంచి, సింగపూర్ నుంచి వైద్యులను పిలిపించాం' అని చెప్పారు. జయ మృతి వెనుక ఎలాంటి మిస్టరీ లేదని, ఈ విషయంలో విచారణకు తాను సిద్ధమని ఆమె ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తాను ప్రమాణస్వీకారం చేస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. డీఎంకే ప్రమేయం వల్లే తమిళనాడులో ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని ఆమె ఆరోపించారు.