జయ సమాధి వద్ద సంచలనం!
చెన్నై: తమిళనాడులోని చెన్నై మెరీనా తీరంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మెరీనా బీచ్ లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద మాజీ సీఎం పన్నీర్ సెల్వం మౌనదీక్షకు కూర్చోవడం కలకలం రేపింది. అన్నాడీఎంకే నేతలు, సన్నిహితులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా... జయ సమాధి వద్ద నుంచి కదిలేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. ఆయన భీష్మించుకుని మౌనదీక్షలో కూర్చోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అన్నాడీఎంకే నేతలు, శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పన్నీర్ సెల్వం మద్ధతుదారులు అక్కడికి భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఏం జరుగుతుందోన్న ఉత్కంఠ నెలకొంది.
జయలలిత కన్నుమూసిన తర్వాత సీఎం పీఠం అధిష్టించిన పన్నీర్ సెల్వం ఇటీవల రాజీనామ చేయగా గవర్నర్ ఆ లేఖను ఆమోదించిన విషయం తెలిసిందే. మరోవైపు జయ నెచ్చెలి, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఉన్న శశికళా నటరాజన్, అన్నాడీఎంకే పక్షనేతగా ఎన్నికై.. సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ మౌనదీక్ష పార్టీలో తీవ్ర కలకలం రేపింది.