మళ్లీ మార్పు!
Published Tue, Dec 10 2013 2:09 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మంత్రి వర్గంలో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మంత్రుల పనితీరు సక్రమంగా లేకున్నా, అవినీతి ఆరోపణలు ఎదురైనా, ఫిర్యాదులు వెల్లువెత్తినా వారిని ఇంటికి పంపడానికి జయ ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఆ దిశగా రెండున్నరేళ్లలో పదమూడో సారి మంత్రి వర్గం లో మార్పులు చోటుచేసుకున్నాయి. మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో ముఖ్యమంత్రి జయలలితతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సగం మందికి పైగా ఇప్పుడు పదవుల్లో లేరు. ఇందులో జయలలిత నమ్మిన బంటులూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ తప్పులు చేసిన వారిపై ఏ మేరకు జయలలిత కొరడా ఝుళిపిస్తున్నారో స్పష్టం అవుతోన్నది.
రామలింగం అవుట్
ఇటీవల జరిగిన మార్పుల్లో ఇసుక కుంభకోణం దెబ్బకు కీలకమైన ప్రజాపనుల శాఖ నుంచి ప్రాధాన్యత లేని క్రీడల శాఖలో పడిన మంత్రి కేవీ రామలింగానికి పదవీ గండం తప్పలేదు. ఇసుక కుంబకోణం ఓ వైపు, అన్నదాత ముత్తుస్వామి కిడ్నాప్, స్థల కబ్జా ఫిర్యాదు మరో వైపు ఆయన్ను వెంటాడాయి. దీంతో రెండు రోజుల క్రితం ఈరోడ్ అర్బన్ జిల్లా పార్టీ కార్యదర్శి పదవి నుంచి రామలింగాన్ని తొలగించారు. ఆయనకు ఆ పదవి దూరం అయిందో లేదో, ఇక మంత్రి పదవి సైతం ఊడినట్టేనన్న ప్రచారం ఊపందుకుంది. ఊహించినట్టుగానే ప్రస్తుత మార్పుల్లో మంత్రి పదవి నుంచి రామలింగానికి ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో సాత్తూరు ఎమ్మెల్యే ఆర్‌బి ఉదయకుమార్‌కు చోటు కల్పించారు.
ఇవి మార్పులు
తన మంత్రి వర్గంలో మార్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత చేసిన సిఫారసుకు గవర్నర్ రోశయ్య స్పందించారు. ఆమోదముద్ర వేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు క్రీడల శాఖ మంత్రి కేవి రామలింగంకు ఉద్వాసన పలికారు. సాత్తూరు ఎమ్మెల్యే ఆర్‌బి ఉదయకుమార్‌కు చోటు కల్పించారు. క్రీడల శాఖ పదవిని ఆర్‌బి ఉదయకుమార్‌కు అప్పగించగా, మరో ముగ్గురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగాయి. బివి రమణ వద్ద ఉన్న వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖను ఎంసి సంపత్‌కు మార్చారు. ఎంసీ సంపత్ వద్ద ఉన్న పర్యావరణ శాఖను ఎన్‌డి వెంకటాచలంకు,
ఆయన వద్ద ఉన్న రెవెన్యూ శాఖను బివి రమణకు కేటాయించారు. బుధవారం ఉదయం రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆర్‌బి ఉదయకుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవీ రామలింగానికి ఉద్వాసన పలకడం, ముగ్గురి శాఖల్లో మార్పులు జరగడంతో అన్నాడీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మంత్రుల శాఖల్లో మార్పులు జరిగిన పక్షంలో, వారికి త్వరలో పదవీ గండం ఉన్నట్టేనా? అన్న గత అనుభవాల్ని గుర్తు చేసుకుంటుండటం గమనార్హం. అలాగే, ఆర్ బి ఉదయకుమార్ ఇది వరకు జయలలిత కెబినెట్‌లో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయనకు గతంలో ఉద్వాసన పలికి, తాజాగా మళ్లీ అవకాశం ఇవ్వడంతో జయలలిత నమ్మిన బంటుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Advertisement
Advertisement