Ramalingam
-
విద్యుత్ వాహనాల బీమాకు జాగ్రత్తలు
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతోంది. 2022 ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం మన రహదారులపై 13 లక్షల పైచిలుకు ఈవీలు ఉన్నాయి. మూడేళ్లుగా వీటి అమ్మకా ల వృద్ధి వార్షికంగా 130 శాతంగా ఉంటోంది. వీటిల్లో అత్యధికంగా త్రిచక్ర రవాణా వాహనాలు, తర్వాత స్థానంలో ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నా యి. అయితే మిగతా వాటి తరహాలోనే విద్యుత్ వాహనాలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవి.. ► ఒక్క సారి చార్జి చేస్తే వాహనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందనేది ఒక సవాలు. ► ఈవీలు విజయవంతం కావాలంటే చార్జింగ్‌పరమైన మౌలిక సదుపాయాలు భారీగా అవసరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పురోగమన దశలోనే ఉన్నాయి. ► ఈవీ బ్యాటరీ ఖరీదు.. వాహనం రేటులో దాదాపు సగం దాకా ఉంటోంది. కాబట్టి, బ్యాటరీ దీర్ఘాయుష్షు, వారంటీ, రీసేల్ విలువ గురించి చాలా సందేహాలే ఉన్నాయి. ► ఓవర్ చార్జింగ్ వల్ల వాహనంలో మంటలు చెలరే గితే పరిస్థితి ఏమిటనే భయాలూ ఉన్నాయి. అగ్నిప్రమాదాలకు దారి తీస్తే థర్డ్ పార్టీకి వాటిల్లే ఆస్తి, ప్రాణ నష్టానికి లయబిలిటీపైనా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక మోటరు బీమా పాలసీ దశాబ్దాల కిందట రూపొందింది. అప్పుడు ఈవీలు, హైబ్రీడ్ వాహనాల ఉనికి లేదు. అయితే, మారే మార్కెట్ అవసరాలు, సమయానికి తగినట్లు కొత్త పథకాలను ప్రవేశపెట్టేలా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా రంగ నియంత్రణ సంస్థ స్వేచ్ఛనిస్తోంది. తదనుగుణంగానే బీమా సంస్థలు కూడా పైన పేర్కొన్న పలు సవాళ్లను పరిష్కరించగల యాడ్–ఆన్‌లను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల కోసం బీమా తీసుకునేటప్పుడు కొనుగోలుదారు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ► బ్యాటరీకి విడిగా కవరేజి ఉందా? ఒకవేళ చార్జింగ్ చేసేటప్పుడు వరద లేదా అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవించినట్లయితే బ్యాటరీ పూర్తి నష్టానికి పాలసీలో కవరేజీ ఉండాలి. ► ప్లాస్టిక్, లోహాలు, గాజు లేదా ఫైబర్ ఏవైనా భాగాలు అన్నింటికీ జీరో డిప్రిసియేషన్ కవరేజీ ఉందా అన్నది చూసుకోవాలి. ► ఈవీ వల్ల థర్డ్ పార్టీ ప్రాపర్టీ ధ్వంసమైనా, వారికి గాయాలైనా ఈవీ యజమానిపై దావా వేస్తే పరిహారంపరమైన సమస్యలు ఎదురవకుండా విడి గా లయబిలిటీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ► గోడలో బిగించిన చార్జర్‌కు, చార్జింగ్ చేసే కేబుల్‌కు విడిగా కవరేజి ఉందా లేదా. ఈ భాగాలన్నీ వాహనంలో బిగించి ఉండవు కాబట్టి, వాటి గురించి నిర్దిష్టంగా తెలియపరుస్తూ కవరేజీ కల్పించడం ముఖ్యం. ► ఓఈఎం (వాహనం తయారీ సంస్థ) చేసే ప్రామాణికమైన ఫిట్టింగ్స్కు అదనంగా కారులో బిగించిన ఇన్ఫోటెయిన్మెంట్ గ్యాడ్జెట్లు, మ్యూ జిక్ సిస్టమ్‌లు, ఇతరత్రా ఏవైనా గ్యాడ్జెట్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటికీ కవరేజీ ఉందో లేదో చూసుకోవాలి. -
మూడోసారీ మువ్వా సరెండర్
నెల్లూరు (టౌన్): డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న మువ్వా రామలింగాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేశారు. ఆయన్ను జిల్లా నుంచి వరుసగా పాఠశాల విద్యాశాఖకు మూడుసార్లు సరెండర్ చేశారు. 2016 ఆగస్ట్‌లో డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ 2017 సెప్టెంబర్‌లో డీఈఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యాశాఖ కార్యాలయంలో రికార్డుల్లో అవకతవకలు, కార్యాలయ నిర్వహణ సక్రమంగా లేదంటూ పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేశారు. అనంతరం రెండు నెలల తర్వాత బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉత్తర్వులు తీసుకొచ్చి వెంటనే బాధ్యతలు స్వీకరించారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌గా నాలుగు నెలల పాటు పనిచేశారు. ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడి విషయంలో డైరెక్టర్ ఉత్తర్వులను పాటించలేదనే ఫిర్యాదుతో మువ్వా రామలింగాన్ని రెండోసారి పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేశారు. తదనంతరం 2018 ఆగస్ట్ మొదటి వారంలో డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉత్తర్వులు తీసుకొని వెంటనే బాధ్యతలు స్వీకరించారు. సరెండర్ చేసినా మళ్లీ జిల్లాకు రావడంపై సీరియస్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ మువ్వా రామలింగాన్ని రెండు సార్లు పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేసినా మళ్లీ జిల్లాకు రావడంపై కలెక్టర్ ముత్యాలరాజు సీరియస్‌గా తీసుకున్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకునే సమయంలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలవలేదు. దీంతో మువ్వా వ్యవహారాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. అప్పుడే మువ్వా ఆర్డర్‌ను కలెక్టర్ వ్యతిరేకించినట్లు చెప్తున్నారు. అయితే కలెక్టర్ మాత్రం మువ్వాను సరెండర్ చేయాలనే నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను జిల్లా విద్యాశాఖ ద్వారా రహస్యంగా నడిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ నెల ఆరున మువ్వా రామలింగాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేస్తూ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు అందాయి. మువ్వాకు మంత్రి నారాయణ అండదండలు మువ్వా రామలింగానికి మంత్రి నారాయణ అండదండలు ఉన్నాయి. ఆయన డీఈఓగా పనిచేస్తున్న సమయంలో నారాయణ విద్యాసంస్థలపై సానుకూల ధోరణిని అవలంబించారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో నగరంలోని ధనలక్ష్మీపురంలో గల నారాయణ స్కూల్లో ఫిజిక్స్ పేపర్‌ను లీక్ చేశారు. ఈ వ్యవహారంలో నారాయణ యాజమాన్యానిదే పూర్తి బాధ్యత ఉన్నా, అప్పటి డీఈఓగా పనిచేసిన రామలింగం సదరు విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సస్పెండైనా, సరెండర్ చేసినా నెలలు తిరగకుండానే మళ్లీ అదే జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. -
హైడ్రామా
డీఈఓ బాధ్యతల స్వీకరణ నెల్లూరు (టౌన్) : నూతన జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులైన మువ్వా రామలింగం బాధ్యతల స్వీకరణ హైడ్రామా మధ్యన సాగింది. బుధవారం ఉదయం 7 గంటలకు డీఈఓగా బాధ్యతలు స్వీకరించేందుకు రామలింగం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలోని డీఈఓ చాంబరులో ఆశీనులై రిజిస్టర్లో సంతకం చేశారు. అనంతరం అభినందనల కార్యక్రమాల్లో మునిగిపోయారు. అయితే ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి ఆయనకు బాధ్యతలు అప్పగించలేదు. కలెక్టర్ ముత్యాలరాజు సాయంత్రం వరకు వేచి ఉండాలని సూచించినట్లు తెలిసింది. రామలింగానికి సంబంధించిన గత రికార్డులను తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం. రామలింగంకు పోస్టింగ్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సైతం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. అయితే జిల్లా మంత్రి నారాయణ విద్యాశాఖ మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో విధిలేని పరిస్థితుల్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రామలింగానికి డీఈఓ బాధ్యతలను ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి సాయంత్రం 5గంటలకు అప్పగించారు. కాగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన మువ్వాకు పలువురు అభినందనలు తెలిపారు. బీసీ సంఘం నేతలు కార్యాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నాయుకులు అభినందనలు తెలిపారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం మాత్రం అభినందలకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిచడమే తన లక్ష్యమని డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన మువ్వా రామలింగం తెలిపారు. ఐఐటీ ఫౌండేషన్ అమల్లో జిల్లాలను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వచ్చే ఏడాది 3లక్షలకుపైగా విద్యార్థులు చదివేలా కృషి చేస్తామన్నారు. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, మౌలిక వసతుల కల్పనపై తల్లిదండ్రులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే ఉత్తమ విద్య అందుతుందన్నారు. -
పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత
అమ్మ ఇంటి వద్ద ఆత్మాహుతి యత్నం అన్నాడీఎంకే నేతపై చర్యకు డిమాండ్ మహిళ నిరాహారదీక్ష చెన్నై : అన్నాడీఎంకే నేతపై చర్య తీసుకోవాలంటూ పార్టీ అధినేత్రి జయలలిత ఇంటి వద్ద ఆత్మాహుతియత్నం చేయడంతో స్వలంగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తిరుచ్చిరాపల్లి మనప్పారైకి చెందిన రామలింగం (60) మున్సిపాలిటీలో కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. పనుల సిఫారసు కోసం అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే మనప్పారై యూనియన్ కార్యదర్శి సేతుకు రామలింగం రూ.17 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సొమ్ము చెల్లించి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు హామీలు ఇవ్వడం మినహా పనులను కేటాయింపు జరగలేదు. తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వలేదు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసిన రామలింగాన్ని సేతు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చే సినా చర్య తీసుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన రామలింగం చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని సీఎం జయలలిత నివాసం సమీపంలోకి శనివారం చేరుకున్నాడు. తనను మోసం చేసిన సేతుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ క్యాన్‌లో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పటించుకునేందుకు సిద్ధమయ్యాడు. బందోబస్తులో ఉన్న పోలీసులు పరుగున వచ్చి రామలింగాన్ని అడ్డుకుని విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మహిళ నిరాహారదీక్ష: నీలగిరి నియోజకవర్గానికి చెందిన అన్నాడీఎంకే ప్రముఖురాలు శ్రీజ తన పిల్లలతో కలసి శనివారం పోయెస్‌గార్డెన్‌కు వచ్చారు. అకస్మాత్తుగా నడిరోడ్డులో కూర్చుని నిరాహారదీక్ష ప్రారంభించారు. దీంతో పోలీసులకు, శ్రీజకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. 20 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నా తగిన గుర్తింపు లేదని, ఈ విషయమై పోయెస్గార్డెన్లోనూ, పార్టీ కేంద్రకార్యాలయంలోనూ వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదని ఆమె విమర్శించారు. ఈనెల 9వ తేదీన తాను సమర్పించిన వినతిపత్రంలో ఆరోపించిన వ్యక్తికే ఆ పత్రం చేరిందని ఆమె అన్నారు. ఈ కారణంగా ముఖ్యమంత్రిని కలిసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించారు. సాయంత్రం 4 గంటల తరువాత వస్తే సీఎంను కలవవచ్చని పోలీసులు నచ్చజెప్పి పంపించారు. సీఎం ఇంటి సమీపంలో ఒకే రోజు జరిగిన ఈ రెండు సంఘటనలు స్వల్ప ఉద్రిక్తకు దారితీసాయి. -
మళ్లీ మార్పు!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మంత్రి వర్గంలో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మంత్రుల పనితీరు సక్రమంగా లేకున్నా, అవినీతి ఆరోపణలు ఎదురైనా, ఫిర్యాదులు వెల్లువెత్తినా వారిని ఇంటికి పంపడానికి జయ ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఆ దిశగా రెండున్నరేళ్లలో పదమూడో సారి మంత్రి వర్గం లో మార్పులు చోటుచేసుకున్నాయి. మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో ముఖ్యమంత్రి జయలలితతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సగం మందికి పైగా ఇప్పుడు పదవుల్లో లేరు. ఇందులో జయలలిత నమ్మిన బంటులూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ తప్పులు చేసిన వారిపై ఏ మేరకు జయలలిత కొరడా ఝుళిపిస్తున్నారో స్పష్టం అవుతోన్నది. రామలింగం అవుట్ ఇటీవల జరిగిన మార్పుల్లో ఇసుక కుంభకోణం దెబ్బకు కీలకమైన ప్రజాపనుల శాఖ నుంచి ప్రాధాన్యత లేని క్రీడల శాఖలో పడిన మంత్రి కేవీ రామలింగానికి పదవీ గండం తప్పలేదు. ఇసుక కుంబకోణం ఓ వైపు, అన్నదాత ముత్తుస్వామి కిడ్నాప్, స్థల కబ్జా ఫిర్యాదు మరో వైపు ఆయన్ను వెంటాడాయి. దీంతో రెండు రోజుల క్రితం ఈరోడ్ అర్బన్ జిల్లా పార్టీ కార్యదర్శి పదవి నుంచి రామలింగాన్ని తొలగించారు. ఆయనకు ఆ పదవి దూరం అయిందో లేదో, ఇక మంత్రి పదవి సైతం ఊడినట్టేనన్న ప్రచారం ఊపందుకుంది. ఊహించినట్టుగానే ప్రస్తుత మార్పుల్లో మంత్రి పదవి నుంచి రామలింగానికి ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో సాత్తూరు ఎమ్మెల్యే ఆర్బి ఉదయకుమార్‌కు చోటు కల్పించారు. ఇవి మార్పులు తన మంత్రి వర్గంలో మార్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత చేసిన సిఫారసుకు గవర్నర్ రోశయ్య స్పందించారు. ఆమోదముద్ర వేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు క్రీడల శాఖ మంత్రి కేవి రామలింగంకు ఉద్వాసన పలికారు. సాత్తూరు ఎమ్మెల్యే ఆర్బి ఉదయకుమార్‌కు చోటు కల్పించారు. క్రీడల శాఖ పదవిని ఆర్బి ఉదయకుమార్‌కు అప్పగించగా, మరో ముగ్గురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగాయి. బివి రమణ వద్ద ఉన్న వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖను ఎంసి సంపత్‌కు మార్చారు. ఎంసీ సంపత్ వద్ద ఉన్న పర్యావరణ శాఖను ఎన్డి వెంకటాచలంకు, ఆయన వద్ద ఉన్న రెవెన్యూ శాఖను బివి రమణకు కేటాయించారు. బుధవారం ఉదయం రాజ్ భవన్లో జరిగే కార్యక్రమంలో ఆర్బి ఉదయకుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవీ రామలింగానికి ఉద్వాసన పలకడం, ముగ్గురి శాఖల్లో మార్పులు జరగడంతో అన్నాడీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మంత్రుల శాఖల్లో మార్పులు జరిగిన పక్షంలో, వారికి త్వరలో పదవీ గండం ఉన్నట్టేనా? అన్న గత అనుభవాల్ని గుర్తు చేసుకుంటుండటం గమనార్హం. అలాగే, ఆర్ బి ఉదయకుమార్ ఇది వరకు జయలలిత కెబినెట్లో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయనకు గతంలో ఉద్వాసన పలికి, తాజాగా మళ్లీ అవకాశం ఇవ్వడంతో జయలలిత నమ్మిన బంటుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
ప్రక్షాళన !
సాక్షి, చెన్నై : రాష్ట్ర పార్టీలో ప్రక్షాళనకు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. నలుగురిని పార్టీ పదవి నుంచి సాగనంపుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో ఇసుక దెబ్బకు ప్రాధాన్యత లేని శాఖలో పడిన మంత్రి కేవీ రామలింగం కూడా ఉన్నారు. పార్టీ కార్యకర్తల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని పరిశీలించి తన దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ప్రకటించారు. పార్టీ సర్వ సభ్య సమావేశానికి ముందే మార్పుల ప్రక్రియకు అధినేత్రి జయలలిత శ్రీకారం చుట్టడంతో, తదుపరి జాబితాలో ఉండేదెవరోనన్న చర్చ అన్నాడీఎంకేలో బయలు దేరింది.పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా సరే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మాత్రం ఉపేక్షించరు. ఎవరి మీదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చినా, తక్షణం విచారించి కొరడా ఝుళిపిస్తుంటారు. అందుకే ఏ క్షణాన ఎవరి పదవి ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో పార్టీలోని నాయకులు, కేబినెట్లోని మం త్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పార్టీ సర్వసభ్య సమావేశం కాబోతున్నదంటే చాలు నేతల్లో గుబులు రెట్టింపు అవుతుంటుంది. ఈ సమావేశానంతరం ఎందరి పదవులు ఊడుతాయో, కొత్త వాళ్లు ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొనడం సహజం. అయితే, ఈ పర్యాయం పంథాను మార్చినట్టున్నారు. సర్వసభ్య సమావేశానికి ముందే పార్టీలో ప్రక్షాళనకు జయలలిత శ్రీకారం చుట్టినట్టున్నారు. ఇది పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తదుపరి జయలలిత టార్గెట్‌లో ఉండేదెవరోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడే పలువురికి ఉద్వాసన పలకడంతో ముందు రోజుల్లో ఎవరెవరిపై వేటు పడుతుందో, 19న జరిగే భేటీ అనంతరం మంత్రి వర్గంలోనూ ఏ మేరకు మార్పులు చేర్పులు ఉంటాయోనన్న ఉత్కంఠతో అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి. దీంతో నేతల్లో గుబులు పట్టుకుంది. ఉద్వాసన: నీలగిరి, రామానాథపురం, తిరువణ్ణామలై దక్షిణం, ఈరోడ్ అర్బన్ పార్టీ కార్యదర్శుల్ని పదవుల నుంచి తొలగిస్తూ శుక్రవారం సాయంత్రం జయలలిత నిర్ణయం తీసుకున్నారు. వీరిలో కేవి రామలింగం కూడా ఉన్నారు. ఈరోడ్ అర్బన్ జిల్లా పార్టీ కార్యదర్శిగా, ప్రజా పనుల శాఖ మంత్రిగా చక్రం తిప్పుతూ వచ్చిన రామలింగం నెత్తిన ఇసుక దెబ్బ పడ్డ విషయం తెలిసిందే. ప్రాధాన్యత లేని క్రీడల శాఖలో పడిన ఆయన్ను పదవీ గండం తరుముతూ వస్తున్నది. అన్నదాత ముత్తుస్వామి స్థల కబ్జా, కిడ్నాప్ వ్యవహారం ఆయన మెడకు ఉచ్చుగా మారింది. కబ్జా, కిడ్నాప్ వ్యవహారంలో మంత్రికి అండగా ముత్తుస్వామి తనయులు నిలబడ్డా, అధినేత్రి జయలలిత మాత్రం కరుణించ లేదు. పార్టీ పరంగా ఆయన మీద ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటిని పరిశీలించిన జయలలిత అర్బన్ జిల్లా కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశా రు. ఆ పదవిని ఈరోడ్ రూరల్ జిల్లా కార్యదర్శి, రెవెన్యూ మంత్రి వెంకటాచలంకు అదనపు బాధ్యతగా అప్పగించారు. తాజా ఉద్వాసనతో ఈరోడ్‌లో సెంగుట్టయన్ తర్వాత జయలలిత ఆగ్రహానికి గురైన నేతగా రామలింగం నిలిచారు. పార్టీ పదవి దూరం కావడంతో మరి కొద్ది రోజుల్లో ఆయన మంత్రి పదవి ఊడబోతున్నది ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, అర్బన్ జిల్లా పార్టీ పదవిని తాత్కాలికంగా వెంకటాచలంకు అప్పగించారు. అర్జునన్కూ దూరం: నీలగిరి జిల్లా పార్టీ కార్యదర్శి అర్జునన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎంపీగా బాధ్యతల్ని ఆయన చేపట్టిన ఆయన ఎక్కువ సమయం ఢిల్లీలో ఉండాల్సి వస్తున్నది. పార్టీ కార్యక్రమాలు ఆయనకు తలకు మించిన భారంగా మారుతోంది. జోడు పదవులతో అర్జునన్ పడుతున్న తంటాల్ని పరిగణనలోకి తీసుకున్న జయలలిత పార్టీ పదవి నుంచి విముక్తి చేశారు. ఆ పదవిని జయ పేరవైలో ఉన్న బాలనందకుమార్‌కు అప్పగించారు. రామనాధపురం జిల్లా కార్యదర్శి మునుస్వామికి ఉద్వాసన పలికారు. సహకార ఎన్నికల్లో ఆయన వ్యవహరించిన తీరుపై అధిష్టానానికి వెల్లువెత్తిన ఫిర్యాదులే ఉద్వాసనకు కారణం అయ్యాయి. ఈ పదవిని ఎంజియార్ యువజన మండ్ర కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయకుమార్ కు తాత్కాలికంగా అప్పగించారు. తిరువణ్ణామలై దక్షిణం జిల్లా పార్టీ కార్యదర్శి బాల చంద్రన్‌కు కూడా పదవీ గండం తప్పలేదు. ఆయనకు ఉద్వాసన పలికి ఆ పదవిని తాత్కాలికంగా ఉత్తరం జిల్లా పార్టీ కార్యదర్శి , ఐటీ మంత్రి సుబ్రమణ్యంకు అప్పగించారు. ఫిర్యాదుల కమిటీ: సచివాలయంలోని సీఎం సెల్‌కు వచ్చే ఫిర్యాదుల్ని అధికారులు పరిశీలించి జయలలిత దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నారు. అన్నింటినీ పార్టీ కార్యాలయ వర్గాలు పరిశీలించడం, వాటిని జయలలిత దృష్టికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని గుర్తించిన జయలలిత ఫిర్యాదుల పరిశీలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జయ పేరవై కార్యదర్శి టీఆర్ అన్భళగన్, ఎమ్మెల్యే గోకుల ఇందిర, పార్టీ నిర్వాహక కార్యదర్శి సెల్వరాజ్, యువజన విభాగం కార్యదర్శి పి కుమార్ ఉన్నారు. గతంలో జయ ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గోకుల ఇందిరకు తాజాగా ప్రకటించిన ఈ ఫిర్యాదుల పరిశీలన కమిటీలో చోటు దక్కడం గమనార్హం.