ప్రక్షాళన ! | Ramalingam Relieved from AIADMK Post | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన !

Published Sat, Dec 7 2013 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

Ramalingam Relieved from AIADMK Post

 సాక్షి, చెన్నై : రాష్ట్ర పార్టీలో ప్రక్షాళనకు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. నలుగురిని పార్టీ పదవి నుంచి సాగనంపుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో ఇసుక దెబ్బకు ప్రాధాన్యత లేని శాఖలో పడిన మంత్రి కేవీ రామలింగం కూడా ఉన్నారు. పార్టీ కార్యకర్తల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని పరిశీలించి తన దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ప్రకటించారు. పార్టీ సర్వ సభ్య సమావేశానికి ముందే మార్పుల ప్రక్రియకు అధినేత్రి జయలలిత శ్రీకారం చుట్టడంతో, తదుపరి జాబితాలో ఉండేదెవరోనన్న చర్చ అన్నాడీఎంకేలో బయలు దేరింది.పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా సరే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మాత్రం ఉపేక్షించరు. ఎవరి మీదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చినా, తక్షణం విచారించి కొరడా ఝుళిపిస్తుంటారు. అందుకే ఏ క్షణాన ఎవరి పదవి ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో పార్టీలోని నాయకులు, కేబినెట్‌లోని మం త్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
 
 పార్టీ సర్వసభ్య సమావేశం కాబోతున్నదంటే చాలు నేతల్లో గుబులు రెట్టింపు అవుతుంటుంది. ఈ సమావేశానంతరం ఎందరి పదవులు ఊడుతాయో, కొత్త వాళ్లు ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొనడం సహజం. అయితే, ఈ పర్యాయం పంథాను మార్చినట్టున్నారు. సర్వసభ్య సమావేశానికి ముందే పార్టీలో ప్రక్షాళనకు జయలలిత శ్రీకారం చుట్టినట్టున్నారు. ఇది పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తదుపరి జయలలిత టార్గెట్‌లో ఉండేదెవరోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడే పలువురికి ఉద్వాసన పలకడంతో ముందు రోజుల్లో ఎవరెవరిపై వేటు పడుతుందో, 19న జరిగే భేటీ అనంతరం మంత్రి వర్గంలోనూ ఏ మేరకు మార్పులు చేర్పులు ఉంటాయోనన్న ఉత్కంఠతో అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి. దీంతో నేతల్లో గుబులు పట్టుకుంది.
 
 ఉద్వాసన: నీలగిరి, రామానాథపురం, తిరువణ్ణామలై దక్షిణం, ఈరోడ్ అర్బన్ పార్టీ కార్యదర్శుల్ని పదవుల నుంచి తొలగిస్తూ శుక్రవారం సాయంత్రం జయలలిత నిర్ణయం తీసుకున్నారు. వీరిలో కేవి రామలింగం కూడా ఉన్నారు. ఈరోడ్ అర్బన్ జిల్లా పార్టీ కార్యదర్శిగా, ప్రజా పనుల శాఖ మంత్రిగా చక్రం తిప్పుతూ వచ్చిన రామలింగం నెత్తిన ఇసుక దెబ్బ పడ్డ విషయం తెలిసిందే. ప్రాధాన్యత లేని క్రీడల శాఖలో పడిన ఆయన్ను పదవీ గండం తరుముతూ వస్తున్నది. అన్నదాత ముత్తుస్వామి స్థల కబ్జా, కిడ్నాప్ వ్యవహారం ఆయన మెడకు ఉచ్చుగా మారింది. కబ్జా, కిడ్నాప్ వ్యవహారంలో మంత్రికి అండగా ముత్తుస్వామి తనయులు నిలబడ్డా, అధినేత్రి జయలలిత మాత్రం కరుణించ లేదు. 
 
 పార్టీ పరంగా ఆయన మీద ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటిని పరిశీలించిన జయలలిత అర్బన్ జిల్లా కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశా రు. ఆ పదవిని ఈరోడ్  రూరల్ జిల్లా కార్యదర్శి, రెవెన్యూ మంత్రి వెంకటాచలంకు అదనపు బాధ్యతగా అప్పగించారు. తాజా ఉద్వాసనతో ఈరోడ్‌లో సెంగుట్టయన్ తర్వాత జయలలిత ఆగ్రహానికి గురైన నేతగా రామలింగం నిలిచారు. పార్టీ పదవి దూరం కావడంతో మరి కొద్ది రోజుల్లో ఆయన మంత్రి పదవి ఊడబోతున్నది ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, అర్బన్ జిల్లా పార్టీ పదవిని తాత్కాలికంగా వెంకటాచలంకు అప్పగించారు. 
 
 అర్జునన్‌కూ దూరం: నీలగిరి జిల్లా పార్టీ కార్యదర్శి అర్జునన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎంపీగా బాధ్యతల్ని ఆయన చేపట్టిన ఆయన ఎక్కువ సమయం ఢిల్లీలో ఉండాల్సి వస్తున్నది.  పార్టీ కార్యక్రమాలు ఆయనకు తలకు మించిన భారంగా మారుతోంది. జోడు పదవులతో అర్జునన్ పడుతున్న తంటాల్ని పరిగణనలోకి తీసుకున్న జయలలిత పార్టీ పదవి నుంచి విముక్తి చేశారు. ఆ పదవిని జయ పేరవైలో ఉన్న బాలనందకుమార్‌కు అప్పగించారు. రామనాధపురం జిల్లా కార్యదర్శి  మునుస్వామికి ఉద్వాసన పలికారు. సహకార ఎన్నికల్లో ఆయన వ్యవహరించిన తీరుపై అధిష్టానానికి వెల్లువెత్తిన ఫిర్యాదులే ఉద్వాసనకు కారణం అయ్యాయి. ఈ పదవిని ఎంజియార్ యువజన మండ్ర కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయకుమార్ కు తాత్కాలికంగా అప్పగించారు. తిరువణ్ణామలై దక్షిణం జిల్లా పార్టీ కార్యదర్శి బాల చంద్రన్‌కు కూడా పదవీ గండం తప్పలేదు. ఆయనకు ఉద్వాసన పలికి ఆ పదవిని తాత్కాలికంగా ఉత్తరం జిల్లా పార్టీ కార్యదర్శి , ఐటీ మంత్రి సుబ్రమణ్యంకు అప్పగించారు. 
 
 ఫిర్యాదుల కమిటీ: సచివాలయంలోని సీఎం సెల్‌కు వచ్చే ఫిర్యాదుల్ని అధికారులు పరిశీలించి జయలలిత దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నారు. అన్నింటినీ పార్టీ కార్యాలయ వర్గాలు పరిశీలించడం, వాటిని  జయలలిత దృష్టికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని గుర్తించిన జయలలిత ఫిర్యాదుల పరిశీలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జయ పేరవై కార్యదర్శి టీఆర్ అన్భళగన్, ఎమ్మెల్యే గోకుల ఇందిర, పార్టీ నిర్వాహక కార్యదర్శి సెల్వరాజ్, యువజన విభాగం కార్యదర్శి పి కుమార్ ఉన్నారు. గతంలో జయ ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గోకుల ఇందిరకు తాజాగా ప్రకటించిన ఈ ఫిర్యాదుల పరిశీలన కమిటీలో చోటు దక్కడం గమనార్హం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement