పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత
అమ్మ ఇంటి వద్ద ఆత్మాహుతి యత్నం
అన్నాడీఎంకే నేతపై చర్యకు డిమాండ్
మహిళ నిరాహారదీక్ష
చెన్నై : అన్నాడీఎంకే నేతపై చర్య తీసుకోవాలంటూ పార్టీ అధినేత్రి జయలలిత ఇంటి వద్ద ఆత్మాహుతియత్నం చేయడంతో స్వలంగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తిరుచ్చిరాపల్లి మనప్పారైకి చెందిన రామలింగం (60) మున్సిపాలిటీలో కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు.
పనుల సిఫారసు కోసం అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే మనప్పారై యూనియన్ కార్యదర్శి సేతుకు రామలింగం రూ.17 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సొమ్ము చెల్లించి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు హామీలు ఇవ్వడం మినహా పనులను కేటాయింపు జరగలేదు. తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వలేదు.
డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసిన రామలింగాన్ని సేతు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చే సినా చర్య తీసుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన రామలింగం చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని సీఎం జయలలిత నివాసం సమీపంలోకి శనివారం చేరుకున్నాడు. తనను మోసం చేసిన సేతుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ క్యాన్‌లో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పటించుకునేందుకు సిద్ధమయ్యాడు. బందోబస్తులో ఉన్న పోలీసులు పరుగున వచ్చి రామలింగాన్ని అడ్డుకుని విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
మహిళ నిరాహారదీక్ష: నీలగిరి నియోజకవర్గానికి చెందిన అన్నాడీఎంకే ప్రముఖురాలు శ్రీజ తన పిల్లలతో కలసి శనివారం పోయెస్‌గార్డెన్‌కు వచ్చారు. అకస్మాత్తుగా నడిరోడ్డులో కూర్చుని నిరాహారదీక్ష ప్రారంభించారు. దీంతో పోలీసులకు, శ్రీజకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. 20 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నా తగిన గుర్తింపు లేదని, ఈ విషయమై పోయెస్‌గార్డెన్‌లోనూ, పార్టీ కేంద్రకార్యాలయంలోనూ వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదని ఆమె విమర్శించారు.
ఈనెల 9వ తేదీన తాను సమర్పించిన వినతిపత్రంలో ఆరోపించిన వ్యక్తికే ఆ పత్రం చేరిందని ఆమె అన్నారు. ఈ కారణంగా ముఖ్యమంత్రిని కలిసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించారు. సాయంత్రం 4 గంటల తరువాత వస్తే సీఎంను కలవవచ్చని పోలీసులు నచ్చజెప్పి పంపించారు. సీఎం ఇంటి సమీపంలో ఒకే రోజు జరిగిన ఈ రెండు సంఘటనలు స్వల్ప ఉద్రిక్తకు దారితీసాయి.