Voice recording
-
విశాఖ: ఒక్క రాంగ్‌కాల్ మూల్యం.. రూ.4 కోట్లు!!
అల్లూరి సీతారామరాజు: నగరానికి చెందిన 35 ఏళ్ల మహిళ నాలుగేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి తెరపడింది. శ్రీకాళహస్తికి చెందిన బి.అక్షయ్ కుమార్ అనే వ్యక్తి ఆమెను రాంగ్ కాల్ ద్వారా పరిచయం చేసుకుని, ఆపై బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివి.. 2020లో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో అక్షయ్ కుమార్ పొరపాటున బాధితురాలికి ఫోన్ చేశాడు. మొదట్లో ఆమె స్పందించకపోయినా, అతను మెసేజ్‌లు పంపుతూ ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నాడు. బలవంతంగా స్నేహం కొనసాగిస్తూ.. మాట్లాడమని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో తన వద్ద ఉన్న వాయిస్ రికార్డింగ్‌లను ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించాడు. అంతేకాదు ఏకంగా రూ.10 లక్షలను సీఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్లో ఆమె నుంచి తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెను కారులో నగరంలోని హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి, వాటితో ఆమెను నిత్యం బెదిరించడం మొదలుపెట్టాడు. అలా దాదాపు రూ.4 కోట్ల నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు. ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు వీడియోలు పంపుతానని బెదిరించడంతో పాటు, ఆమె భర్తపై యాసిడ్ దాడి చేస్తానని, పిల్లలను కిడ్నాప్ చేస్తానని కూడా బెదిరించాడు. గత వారం నిందితుడు నోవాటెల్‌కు రమ్మని డిమాండ్ చేయగా, బాధితురాలు నిరాకరించింది. దీంతో మళ్లీ బెదిరింపులకు దిగాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకునే స్థితికి చేరుకుంది. చివరకు ఆమె తన భర్త, కుటుంబ సభ్యుల సహాయంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక కారు, మొబైల్ ఫోన్, 65 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్.. ఇలా చేస్తే సరి!
WhatsApp Voice Calls Recording Tips: కాల్ రికార్డింగ్‌లు.. ఈ మధ్యకాలంలో ‘సేఫ్‌సైడ్’ వ్యవహారాలుగా మారిపోయాయి. ఇంటర్వ్యూలు, ఆన్లైన్ క్లాసుల రికార్డింగ్.. అన్నింటికి మించి ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కాల్ రికార్డింగ్‌లు చేస్తుండడం చూస్తున్నాం. అయితే వాట్సాప్ కాల్స్‌కు రికార్డింగ్ ఆప్షన్ ఉండదని, అవతలివాళ్లు రికార్డు చేయలేరేమోనని చాలామంది పొరపడుతుంటారు. కానీ, వాట్సాప్ కాల్స్‌ను కూడా రికార్డు చేయొచ్చు. సింపుల్.. ఫోన్లో వాయిస్ రికార్డింగ్ యాప్ ఏదైనా ఉంటే చాలు, వాట్సాప్ వాయిస్ కాల్‌ను రికార్డు చేసేయొచ్చు. అంటే వాట్సాప్‌లో ఇన్‌బిల్డ్ ఫీచర్ లేకున్నా.. థర్డ్ పార్టీ యాప్‌ను వాట్సాప్ అనుమతిస్తుందన్నమాట. అయితే ఆ టైంలో .. స్పీకర్‌ను తప్పనిసరిగా ఆన్ చేయాలి. లేకుంటే ఆ వాయిస్ రికార్డు అవ్వదు. ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక రికార్డింగ్ యాప్‌ల ద్వారా వాట్సాప్ వీడియో కాల్స్‌ను సైతం రికార్డ్ చేయొచ్చు. అదే యాపిల్ ఫోన్లలో ఇలా రికార్డింగ్ చేయడం కుదరదు. కారణం.. థర్డ్ పార్టీ యాప్‌లను యాపిల్ అనుమతించకపోవడం, పైగా మైక్రోఫోన్ రికార్డింగ్‌కు తగ్గట్లు ఫీచర్ లేకపోవడం. క్యూబ్ కాల్ క్యూబ్ కాల్ అనేది ఫ్రీ రికార్డింగ్ యాప్. సిగ్నల్, స్కైప్, వైబర్, వాట్సాప్, హంగవుట్స్, ఫేస్బుక్, ఐఎంవో, వీచాట్.. ఇలా వేటి నుంచైనా వాయిస్ కాల్ రికార్డు చేయగలదు. ఈ యాప్ కొన్ని ఫోన్లలో ‘షేక్’(అటు ఇటు ఊపడం) ద్వారా పని చేస్తుంది కూడా. ఒకవేళ ఈ యాప్స్ ఏవీ వద్దనుకుంటే.. ప్లేస్టోర్ నుంచి గూగుల్ రికార్డర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. క్యూబ్ కాల్, గూగుల్ రికార్డర్.. ఈ రెండూ ఫ్రీ యాప్స్. పైగా తేలికగా ఎవరైనా ఉపయోగించొచ్చు. ఇక యాపిల్ ఫోన్లలో ఇలా రికార్డు చేసే వీలు లేనప్పటికీ.. మాక్‌లో మాత్రం క్విక్‌టైం ద్వారా వాట్సాప్ వాయిస్ కాల్స్‌ను రికార్డు చేసే వీలుంది. చదవండి: Google Photos- ఇలా చేయకుంటే మీ ఫొటోలు డిలీట్ అవుతాయి మరి! -
మావోల హెచ్చరికలున్నా భద్రత ఇదేనా?
నర్సీపట్నం: మంత్రి అయ్యన్న సోదరుడి కారులో నాలుగు నెలల క్రితం వాయిస్ రికార్డర్ అమర్చినట్లు తేలడం ఇంటెలిజన్స్, పోలీసు వర్గాలకు సవాల్ విసిరినట్లైంది. ఈ విషయమై ‘సాక్షి’లో ప్రముఖంగా వచ్చిన కథనం పట్టణంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వాస్తవానికి మంత్రి అయ్యన్న తనయుడు విజయ్ లేటరైట్ దందాలకు పాల్పడుతున్నారని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆరు నెలలు క్రితం మావోయిస్టులు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికల దృష్ట్యా మంత్రి అయ్యన్న నివాసంతో పాటు సందర్శించే వారిని నిశితంగా పరిశీలించాల్సి ఉంది. కారులో వాయిస్ రికార్డర్ అమర్చడాన్ని బట్టి, ఇంటి భద్రతను పోలీసులు పూర్తిగా గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడీ విషయం పట్టణంలో చర్చనీయాశంగా మారింది. రికార్డయిన వాయిస్ ఎప్పటికప్పుడు బయటికి పొక్కిందా..? అన్నది తేలాల్సి ఉంది. మంత్రి నివాసంలో వాహనం పార్కు చేసి ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం నిత్యం ఏదో ప్రాంతానికి సోదరుడి దంపతులతో పాటు ముఖ్య అనుచరులతో ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ సమయంలో వారు అంతర్గతంగా చర్చించుకున్న అంశాలు ఈ రికార్డర్ ద్వారా ఏమేరకు అమర్చిన వ్యక్తులకు చేరి ఉంటాయో పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా బలమైన అంశాలపై జరిగిన చర్చలకు సంబంధించి వాయిస్ రికార్డర్లో నమోదై ఉంటే భవిష్యత్తులో ఎటువంటి పరిణామానాలకు దారి తీస్తుందో.. రికార్డయిన అంశాలు మంత్రిపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్లి అందరి నోళ్లలో తలలో నాలుకుగా ఉండే సన్యాసిపాత్రుడి కారులో వాయిస్ రికార్డర్ పెట్టడాన్ని పట్టణ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు ఈ కేసును ఛేదించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. -
ఖాకీలకు ‘ఐటీ’ సాయం
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో పట్టపగలు నడిరోడ్డులో హత్యో, రోడ్డు ప్రమాదమో జరిగితే.. ఫుల్ ట్రాఫిక్ జాం.. పోలీసులు వెళ్లేందుకు ఆలస్యమవుతుంది.. అక్కడేం జరిగిందో తెలియదు.. ఇక ముందు అలాంటి చోట ఎయిర్ కాప్ వాలిపోతుంది. అక్కడ జరుగుతున్నది ఫోటోలు, వీడియోలు తీసి వాయిస్ రికార్డ్‌తో సహా కంట్రోల్ రూం సర్వర్‌కు పంపుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటివెన్నో ఐటీ నిపుణులు రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు తెలియజేసేందుకు శనివారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ‘డేవ్థాన్’ సదస్సులో ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడారు. ఐటీ నిపుణులు రూపొందించిన కాప్కామ్, రిపోర్ట్ యాప్, అడాప్టివ్ ట్రాఫిక్, ఎయిర్కాప్, చలాన్ అలర్ట పోలీసులకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఐటీ నిపుణులు ప్రజల భద్రతపై దృష్టి సారించడం శుభపరిణామమన్నారు. అడాప్టివ్ ట్రాఫిక్ టెక్నాలజీని ఐటీ నిపుణులు కునాల్, చందన్‌లు రూపొందించారన్నారు. ఎయిర్ కాప్‌ను నిరంజన్ తయారు చేశాడని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేని వారు ఒకే ఒక్క మొబైల్ యాప్‌తో పోలీసులకు రిపోర్టు చేయవచ్చన్నారు. ఈ యాప్‌ను ఐటీ నిపుణులు హిమబిందు, నితిన్‌రెడ్డి రూపొందించారని తెలిపారు. ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుంటే ప్రజలతోపాటు పోలీసులకు కూడా మేలు చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ శశిధర్‌రెడ్డి, డీసీపీలు ఎ.ఆర్.శ్రీనివాసులు, రామారాజేశ్వరి, కార్తికేయతో పాటు పలువురు ఐటీ నిపుణులు ఉన్నారు.