సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబోయి సూపర్ స్టార్ అయ్యాడు
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానన్నది పాతమాట. షారుక్ ఖాన్ మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావలనుకుని బాలీవుడ్ బాద్షా అయ్యారు. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ నూతన సీఈఓ సుందర్ పిచాయ్ సమక్షంలో షారుక్ స్వయంగా ఈ విషయం చెప్పారు.
గతేడాది అక్టోబరులో కాలిఫోర్నియాలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షారుక్ పాల్గొన్నారు. గూగుల్‌ప్లెక్స్‌లో షారుక్.. సుందర్‌తో 30 నిమిషాల పాటు చాట్ చేశారు. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ.. 'నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నా. యాక్టర్ కావాలని అనుకోలేదు. నేను మొద్దులా కనిపిస్తాను కానీ నిజంగా కాదు. నేను చాలా తెలివైనవాణ్ని. ఎలెక్ట్రానిక్స్ చేశా' అని చెప్పారు. తాను ఐఐటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాశానని, తాను చదువకునే కాలంలో ఐటీ అంతగా అభివృద్ది చెందలేదని షారుక్ వెల్లడించారు. హ్యాపీ న్యూ ఇయర్ చిత్రం ప్రమోషన్ కోసం అప్పట్లో షారుక్ అమెరికా వెళ్లారు.
గూగుల్ నూతన సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ నియమితులైన సంగతి తెలిసిందే. షారుక్.. గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించినపుడు సుందర్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. తాజాగా అత్యున్నత పదవి రావడంతో సుందర్ పేరు మారుమోగుతోంది. ప్రధాని సహా చాలామంది ప్రముఖులు సుందర్‌కు అభినందనలు తెలపారు.