waste control
-
GHMC: చెత్త వేస్తే ఈ–చలాన్.. ఎలాగో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఓవైపు చెత్త సమస్యల పరిష్కారం.. మరో వైపు జీహెచ్ఎంసీ ఖజానాకు గండి పడకుండా రెండు రకాలుగా ఉపకరించేందుకు జీహెచ్ఎంసీ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘చెత్త వేస్తే ఈ–చలాన్’ విధానం మంచి ఫలితాలిస్తోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విధానం కోసం జీహెచ్ఎంసీ (GHMC) ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సంబంధిత అధికారులకు శిక్షణ నిచ్చింది. వాటిని వినియోగిస్తూ ప్రస్తుతం వారు మూడు రకాల ఉల్లంఘనలకు పెనాల్టీలు (Penalties) విధిస్తున్నారు. సొమ్ము పక్కదారి పట్టకుండా.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారెవరో గుర్తించేందుకు ప్రస్తుతం అన్నిప్రాంతాల్లో తగిన సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో.. తొలుత దుకాణాల ముందు చెత్త వేసేందుకు ప్రత్యేకంగా చెత్త డబ్బాలు ఏర్పాటు చేయని దుకాణదారులకు, దుకాణాల ముందు వ్యర్థాలు వేస్తున్న వారికి, ఎక్కడ పడితే అక్కడ సీఅండ్‌డీ (నిర్మాణ, కూల్చివేతల) వ్యర్థాలు వేసినట్లు గుర్తించిన వారికి ఈ–చలానాలు (E Challan) విధిస్తున్నారు. దీంతో పాటు పెనాల్టీలను సైతం యూపీఐ (UPI) ద్వారానే చెల్లించాల్సి ఉండటంతో పెనాల్టీల సొమ్ము పక్కదారి పట్టకుండా జీహెచ్ఎంసీ ఖజానాలోకే చేరేందుకు మార్గం ఏర్పడింది. పెనాల్టీల వివరాలు అందుబాటులోకి.. గతంలో పెనాల్టీలకు పుస్తకాల్లోని రసీదులిచ్చినప్పుడు ఎవరికి ఎంత మేర పెనాల్టీ విధించారో, ఎంత వసూలు చేశారో, ఎంత జీహెచ్ఎంసీ ఖజానాలో చెల్లించారో, అసలు చెల్లించారో లేదో తెలిసేది కాదు. ప్రస్తుతం ఈ–చలానా కావడంతో ఎంతమందికి చలానాలు విధించింది, వాటిలో ఎంతమంది చెల్లించింది, ఎంత మొత్తం చెల్లించింది తదితర వివరాలు యాప్‌లోనే ఎప్పుడైనా ఉన్నతాధికారులు సైతం చూడవచ్చని అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ (శానిటేషన్) తెలిపారు.చదవండి: అసలు హెచ్‌సీయూ భూములు ఎన్ని.. వివాదం ఏంటి?అంతేకాకుండా పెనాల్టీలు విధిస్తారని తెలిసి యజమానులు తమ దుకాణాల ముందు బిన్లు ఏర్పాటు చేసుకుంటారని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త, సీఅండ్‌డీ వ్యర్థాలు వేసేవారు కూడా క్రమేపీ తగ్గుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి యాప్‌తో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ఈ అనుభవంతో మున్ముందు మరిన్ని ఉల్లంఘనలకు సైతం ఈ యాప్‌ను వినియోగించుకొని ఈ–చలానాలను విధించనున్నట్లు రఘు ప్రసాద్ తెలిపారు. గత వారం రోజుల్లో దుకాణాల ముందు చెత్త డబ్బాలు ఉంచని 189 మంది దుకాణాల నిర్వాహకులకు విధించిన పెనాల్టీలు రూ.4,10,300. → ఇందులో మంగళవారం 19 మందికి రూ. 55,400 పెనాల్టీలు విధించారు. → వారం రోజుల్లో యూసుఫ్‌గూడ సర్కిల్లో అత్యధికంగా 33 మందికి రూ.1,36,000 పెనాల్టీ విధించారు. → మెహిదీపట్నం, ముషీరాబాద్, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, బేగంపేట, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్ సర్కిళ్లలో మాత్రం ఇంకా ఈ–చలానాలు ఇంకా ప్రారంభించనట్లు తెలిసింది. ఈ సర్కిళ్లలో ఇంతవరకు ఎలాంటి పెనాల్టీలు విధించలేదు. -
వేస్ట్ కలెక్ట్
గచ్చిబౌలి: నగరంలో వ్యర్థాల సమస్య తీరని వ్యధగా మారింది. చెత్తను ఇష్టానుసారంగా పడేస్తుండడంతో అవి నాలాలు, డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయి మురుగునీరు రోడ్లపై పారుతోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ముంపు సమస్య ఏర్పడుతోంది. దీన్ని పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ వినూత్నకార్యక్రమంతో ముందుకెళ్తోంది. 10 కంపెనీలతో కలిసి ‘10డీ రీసైక్లథాన్–2019’ పేరుతో నవంబర్ 3–13 వరకు వెస్ట్‌జోన్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. దీన్ని వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన దాసరి పర్యవేక్షిస్తున్నారు. విద్యాసంస్థలు, కాలనీలు, ఐటీ కంపెనీలలో డ్రై, ఈ–వేస్ట్ సేకరించేందుకు కార్యాచరణ రూపొందించారు. శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్చెరు, యూసుఫ్‌గూడ సర్కిళ్ల పరిధిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్ట్ చేయనున్న వ్యర్థాలను తీసుకునేందుకు ఐటీసీ, సన్శోధన్, రద్దీ కనెక్ట్, రాంకీ ఫౌండేషన్, గోద్రేజ్, మై స్క్రాబ్ బిన్ తదితర కంపెనీలు ముందుకొచ్చాయి. పాత మ్యాట్రెసెస్, బెడ్‌షీట్స్, కుర్చీలు, లెదర్ వస్తువులు, ఐరన్ స్క్రాబ్, పుస్తకాలు, పేపర్లు తదితర వస్తువులను డ్రై–వేస్ట్‌గా పరిగణిస్తారు. ఐటీ కంపెనీలలో వృథాగా పడి ఉండే ఎలక్ట్రానిక్,ఎలక్ట్రికల్ వస్తువులను ఈ–వేస్ట్‌గా పేర్కొంటారు. ముఖ్యంగా పాత సామాన్లను ఎక్కడ పడేయాలో తెలియక చాలామంది నాలాల్లో వేస్తున్నారు. అంతే కాకుండా ప్లాస్టిక్ కవర్లు నిత్యం భారీగా నాలాల్లో చేరుతున్నాయి. ఇవన్నీ మురుగు నీటి ప్రవాహనికి అడ్డంకిగా మారుతున్నాయి. నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగి ప్రధాన రహదారులతో పాటు కాలనీలు మురికికూపాలు అవుతున్నాయి. ప్రజలు అవగాహన లోపంతో ఇలా చేస్తుండడంతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని నివారించాలని వ్యర్థాల సేకరణ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన సర్కిల్అధికారులను ఆదేశించారు. ఎక్కవ సేకరిస్తే బహుమతులు ఎక్కువ డ్రై వేస్ట్‌ను సేకరించి తీసుకొచ్చే విద్యార్థులకు పుస్తకాలు, జూట్ బ్యాగ్‌లు, మొక్కలను బహుమతిగా ఇస్తాం. రీసైక్లింగ్ వేస్టేజీపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తాం. రీసైక్లింగ్‌కు ఉపయోగపడే చెత్తను సేకరించి కంపెనీలకు అందజేస్తాం. మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్, గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్, ఇతర ఐటీ కంపెనీలతో పాటు కాలనీల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఈ–వేస్ట్ సేకరిస్తాం. ఇక డ్రై–వేస్ట్‌ను విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సేకరిస్తాం. ఎక్కువ మొత్తంలో వేస్టేజీ ఉంటే ఫోన్ చేస్తే వాహనాలు వస్తాయి. లేదంటే డివిజన్లలో ఏర్పాటు చేసే కలెక్షన్ సెంటర్లలో అందజేయాలి. ప్రజల సహకారంతోనే 10డీ రీసైక్లథాన్ విజయవంతమవుతుందని ఆశిస్తున్నాం. – హరిచందన దాసరి, వెస్ట్‌జోన్ కమిషనర్ ఒక్కో డివిజన్‌కు రెండు... ⇒ జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో 18 డివిజన్లు ఉన్నాయి. డివిజన్‌కు రెండు చొప్పున 36డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వాటి వివరాలివీ... ⇒ శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అంజయ్యనగర్, కొత్తగూడ, గౌలిదొడ్డి, గుల్మోహర్ కాలనీ, మసీద్‌బండ, గోపీనగర్లలోని కమ్యూనిటీ హళ్లు. ⇒ చందానగర్ సర్కిల్ పరిధిలో మాదాపూర్ వార్డు ఆఫీస్, మియాపూర్ బస్ బాడీ యూనిట్, హఫీజ్‌పేట్ వార్డు ఆఫీస్, చందానగర్ కల్యాణ మండపం, హుడా కాలనీ కమ్యూనిటీ హాల్. ⇒ పటాన్చెరు సర్కిల్ పరిధిలో ఎల్ఐజీ సొసైటీ ఆఫీస్, విద్యాభారతి స్కూల్, పటాన్చెరు చైతన్యనగర్, శాంతినగర్ కమ్యూనిటీ హాల్. ⇒ యూసుఫ్‌గూడ సర్కిల్ పరిధిలో వెంకటగిరి కృష్ణానగర్, ఎల్ఎన్నగర్ గణపతి కాంప్లెక్స్, మధురానగర్, జవహర్‌నగర్, రాజీవ్‌నగర్, బంజారానగర్, రహమత్‌నగర్, కార్మికనగర్, ఎస్ఆర్టీనగర్, ఎస్‌ఆర్‌ఆర్‌పురం సైట్–3. ⇒ వీటితో పాటు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బిన్లను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా కాలనీల్లోనూ ప్రత్యేక వాహనాలు తిరుగుతూ డ్రై వేస్ట్‌ను సేకరిస్తాయి. ⇒ ఎవరైనా డ్రై, ఈ–వేస్ట్‌ను తీసుకోవాలనుకున్నా.. ఇవ్వాలనుకున్నా డాక్టర్ బిందు భార్గవి (శేరిలింగంపల్లి సర్కిల్) 79950 79809, డాక్టర్ రవికుమార్ (చందానగర్, యూసుఫ్‌గూడ సర్కిల్) 80085 54962, డాక్టర్ లక్ష్మణ్ (పటాన్చెరు సర్కిల్) 94410 46896 నంబర్లలో సంప్రదించొచ్చు. -
పుణేలో భారీ చెత్త డిపో
పింప్రి, న్యూస్‌లైన్: వ్యర్థాల నియంత్రణలో భాగంగా పుణేలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో కొత్త డంపింగ్‌యుర్డు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రరూపం దాల్చిన చెత్త డిపో సమస్య ప్రస్తుతం కొలిక్కి వచ్చినట్లు ఉప- ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా పొగవుతున్న చెత్తను ఉరులి దేవాచి గ్రామానికి తరలిస్తున్నారు. వ్యర్థాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఉరులి గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేగాక బాధితులు తరచూ అనారోగ్యం బారినపడుతున్నారు. ఇక్కడి నుంచి చెత్త డిపోను మరో చోటికి తరలించాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గ్రామంలో చెత్తను పోగు చేయడాన్ని అడ్డుకుంటున్నారు. దీంతో వ్యర్థాల భారీ ఎత్తున పోగవుతున్నాయి. గత బుధవారం నుంచి నగరంలోని చెత్త కుప్పలు తెప్పలుగా పడి చుట్టు పక్కల దుర్గంధం వెదజల్లుతోంది. గత బుధవారం నుంచి నగరంలో ప్రస్తుతం సుమారు 4.5 వేల టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. అనేక చోట్ల చెత్త రోడ్లపైకి వచ్చి చేరింది. ఈ విషయంపై ప్రజలు కార్పోరేషన్‌కు ఎన్ని ఫిర్యాదులు చేసినా ‘ముఖ్యమంత్రిని సంప్రదించండి’ అంటూ కార్పొరేషన్ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ సమస్య గురించి ఎవరికి విన్నవించుకోవాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఉరులి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంపై స్పందించిన పవార్, చెత్త డిపోను శివారుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేవించారు. అక్కడ 300 ఎకరాల్లో వ్యర్థాల గుంతను నిర్మిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నందున ఈ విషయమై ప్రకటన చేయలేదని పవార్ వివరణ ఇచ్చారు. -
స్టార్‌హోటళ్లల్లో సమావేశాలు పెట్టొద్దు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్ ఉండడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలు ఖర్చులు తగ్గించుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకంపై నియంత్రణ పాటించాలని సూచించింది. స్టార్‌హోటళ్లల్లో సమావేశాలు నిర్వహించొద్దని కోరింది. ప్రభుత్వ శాఖలన్నీ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. అద్దె వాహనాల వినియోగాన్ని తగ్గించాలని సూచించింది. మంత్రులు, ఉన్నతాధికారులు సాధారణ క్లాస్‌లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, మంత్రులు, ఎమ్మెల్యేలు దుబారాపై ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు తన తాత్కాలిక ఛాంబర్ కోసం రూ. లక్షలు వెచ్చించారు. ఇటీవల ఏపీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు ఓ స్టార్ హోటల్ శిక్షణా తరగతుల నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎంత ఆర్భాంగా నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.