
మందుబాబులకు అడ్డాగా బస్ షెల్టర్
పెదబయలు: మండల కేంద్రం పెదబయలు కూడలిలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్‌షెల్టర్ మందుబాబులకు అడ్డాగా మారింది. స్థానికంగా రెండు వైన్‌షాప్‌లున్నాయి.వాటిలో మద్యం కొనుగోలుచేసి సమీపంలో గల బస్ షెల్టర్‌లో రాత్రీపగలు తేడాలేకుండా తాగుతూ అక్కడే మద్యం సీసాలను చెల్లాచెదరుగా పడేస్తున్నారు. మద్యం బాటిళ్లు, చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలతో ఆ ప్రాంతం నిండిపోయింది. అక్కడ బస్సులను నిలపకపోవడంతో నిరుపయోగంగా మారింది. బస్ షెల్టర్‌కు ఆనుకుని నివాస గృహాలున్నాయి. స్థానికంగా ఉన్న మహిళలు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన బస్‌షెల్టర్ నిరుపయోగంగా మారిందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పోలీసులు స్పందించి బస్‌షెల్టర్‌ను శుభ్రం చేయడంతో పాటు మందుబాబుల ఆగడాలను అరికట్టాలని, బస్ షెల్టర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన చేస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు.