
13 రైల్వే స్టేషన్లలో 28 లిఫ్ట్‌లు
● టెండర్లు ఆహ్వానించిన వాల్తేర్ డివిజన్ ● అమృత్ భారత్‌తో 15 స్టేషన్లకు కొత్త శోభ
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ పథకం ద్వారా వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో 15 రైల్వేస్టేషన్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సౌకర్యాల కల్పనలో భాగంగా స్టేషన్లలో లిఫ్ట్‌లు ఏర్పాటు చేసేందుకు తాజాగా టెండర్లు ఆహ్వానించారు. 13 స్టేషన్ల పరిధిలో రూ.13.67 కోట్లతో 28 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వాల్తేరు డివిజన్ పరిధిలో మొత్తం 15 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో సింహాచలం, దువ్వాడ, అరకు, బొబ్బిలి, చీపురుపల్లి, కొత్తవలస, నౌపడ, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం స్టేషన్లు, ఛత్తీస్‌గఢ్ పరిధిలో జగదల్‌పూర్, ఒడిశా పరిధిలో దమన్‌జోడీ, జైపూర్, కోరాఫుట్, పర్లాఖిముండి రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో కొత్త భవనాలు నిర్మించడంతో పాటు ఎస్కలేటర్లు, లిఫ్టులు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక ఆహార శాలలు, వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు. అలాగే అత్యాధునిక సౌకర్యాలతో మరుగుదొడ్లు, సామగ్రి భద్రపరుచుకునే గదులు, తాగు నీరు, ఏటీఎం సౌకర్యాలు కల్పించనున్నారు. వసతి గదులు, ప్లాట్‌ఫాంలపై డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేస్టేషన్ మొత్తం సీసీ టీవీ పరిధిలో నిఘా ఉంచడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
13 స్టేషన్లలో లిఫ్టుల ఏర్పాటుకు టెండర్లు తాజాగా 13 స్టేషన్లలో లిఫ్ట్‌లు ఏర్పాటుకు రెండు ప్యాకేజీల కింద రూ.13.67 కోట్లతో వాల్తేరు డివిజన్ టెండర్లు ఆహ్వానించింది. ఒక లిఫ్ట్ 13 మంది ప్రయాణికులకు సరిపడేలా, మరో లిఫ్ట్ 20 మందికి సరిపడేలా.. మొత్తం 28 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. చిన్న స్టేషన్లలో ఒకే లిఫ్ట్ ఉండాలని నిబంధన విధించారు. టెండర్లు ఖరారు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చిన ఏడాదిలోపు అన్ని స్టేషన్లలోనూ లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని నిబంధనల్లో స్పష్టం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సింహాచలం, పర్లాఖిముండి స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఈ టెండర్లలో మినహాయించారు.