
అన్నను కడతేర్చిన తమ్ముడు
పెదబయలు: మండలంలో అరడకోట పంచాయతీ పురుగుడిపుట్టు గ్రామంలో దారుణం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో అనుబంధాన్ని, ఆత్మీయతలను మరిచి, విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి వరుసకు అన్నను పొట్టన పెట్టుకున్నాడు. కర్రతో కొట్టడంతో రెండు రోజుల తరువాత మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి కుమారుడు, స్థానిక ఎస్‌ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పురుగుడిపుట్టు గ్రామానికి చెందిన కిల్లో సూరిబాబు, కిలో గణపతి వరుసకు అన్నదమ్ములు. వీరి మధ్య భూ వివాదం నడుస్తోంది. పాతకక్షల నేపథ్యంలో ఈ నెల 3 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న కిల్లో సూరిబాబు(అన్న)పై గణపతి కర్రతో దాడి చేసి తల,ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టాడు. దీంతో సూరిబాబు స్పృహ కోల్పోయి పడిపోయాడు. గ్రామస్తులు ఆయన భార్యకు సమాచారం అందించడంతో ఆమె పెదబయలు పీహెచ్‌సీ తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన చికిత్స కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి రిఫరల్ చేశారు.అయితే అదే రోజు పాడేరు తీసుకువెళ్లకుండా స్వగ్రామం పురుగుడిపుట్టు తీసుకువచ్చేశారు. ఈ నెల 5 తేదీన గుండెలో నొప్పి వస్తోందని సూరిబాబు చెప్పడంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చే లోపు మృతి చెందాడు. ఈ రెండు కుటుంబాల మధ్య ఏడేళ్ల నుంచి భూ, ఇతర వివాదాలు ఉన్నాయి. మృతుడు కిల్లో సూరిబాబుకు భార్య కాసులమ్మ, కుమారుడు లోకేష్, కుమార్తె నందిని ఉన్నారు. సూరిబాబు మృతితో భార్యాపిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితుడు కిల్లో గణపతిని అరెస్టు చేసి, హత్య కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు పెదబయలు ఎస్‌ఐ రమణ ఎస్‌ఐ తెలిపారు.
ఏడేళ్ల నుంచి ఇద్దరి మధ్య భూ వివాదం
ఈ నెల 3వ తేదీన కర్రతో దాడి
పురుగుడిపుట్టలో ఘటన
నిందితుడి గణపతి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు

అన్నను కడతేర్చిన తమ్ముడు