
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు
ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరలేదు. అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతు న్నాయి. సరైన వసతులు లేక అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.
రంపచోడవరం: నియోజకవర్గ కేంద్రం రంపచోడవరంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. దీంతో అరకొర వసతులతో ఏళ్ల తరబడి ప్రభుత్వ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాల నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ఐటీడీఏ క్వార్టర్స్‌కు అద్దె చెల్లిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కార్యాలయాలకు చెల్లించే అద్దెతో భవన నిర్మాణాలు పూర్తయ్యేమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎకై ్సజ్ శాఖ నుంచి ట్రెజరీ వరకు..
రంపచోడవరంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయాన్ని ఏళ్ల తరబడి రంపచోడవరం ఐటీడీఏ క్వార్టర్స్ నిర్వహిస్తున్నారు. సొంత భవనం నిర్మాణం కోసం ఆ శాఖ నుంచి ఇప్పటి ఎటువంటి ప్రతిపాదనలు లేవు. ఐటీడీఏ ఉద్యోగులు నివాసం ఉండాల్సిన క్వార్టర్స్‌లో కార్యాలయాల నిర్వహణతో ఉద్యోగులకు క్వార్టర్స్ లేని పరిస్థితి ఏర్పడింది. ఎకై ్సజ్ శాఖ పలు కేసుల్లో పట్టుకున్న వాహనాలను నిలిపిఉంచేందుకు సరైన ఖాళీ స్థలం కూడా లేదు. రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మండలాల ప్రభుత్వ ఉద్యోగులు రంపచోడవరం ట్రెజరీ ద్వారా సేవలు పొందుతున్నారు. సొంత భవనం లేకపోవడంతో ఐటీడీఏ బి క్వార్టర్స్‌లో ట్రెజరీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్వార్టర్స్ భవనం పాతదైపోవడంతో వర్షాకాలం శ్లాబ్ లీక్ అవుతోంది. దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. 2014–19 మధ్య కాలంలో ట్రెజరీకి సొంత భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారుగాని, భవన నిర్మాణ పనులు ప్రారంభించ లేదు.
● కేంద్ర సిల్క్ బోర్డు కార్యాలయాన్ని పందిరిమామిడిలోని ఒక అద్దె ఇంటిలో నిర్వహిస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడ భవనాన్ని ఖాళీ చేసి పీఎంఆర్‌సీలో ఏర్పాటు చేశారు. ఒక పెద్ద హాల్‌లో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గదులు లేకపోవడంతో అధికారులు, ఉద్యోగులు సిబ్బందులకు గురవుతున్నారు.
● వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయానిదీ ఇదే పరిస్థితి. దీనిని అగ్రి ల్యాబ్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతమంతటినీ ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటుచేసిన తరువాత కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు ప్రత్యేకంగా భవనాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది.
పోలవరం ముంపుతో దేవీపట్నం ఖాళీ..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా మండల కేంద్రమైన దేవీపట్నం గ్రామం కనుమరుగైంది. పోలవరం ముంపులో భాగంగా అప్పట్లోనే ప్రభు త్వ కార్యాలయాలను ఇందుకూరు పేటకు తరలించారు. అక్కడ కొన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ప్రైవేట్,అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.తహసీల్దార్ కార్యాలయాన్ని ఖాళీ చేసిన పాత సోషల్ వెల్ఫేర్ భవనంలో నిర్వహిస్తున్నారు. అక్క డ అరకొర వసతులతోనే కొనసాగిస్తున్నారు. కొత్త భవన నిర్మాణానికి అసలు పునాది రాయి కూడా పడలేదు.పోలీస్‌స్టేషన్‌ను పరగసనిపాడు కాలనీలో ఒక ఇంటిలో ఏర్పాటు చేశారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సచివాలయం భవనంలో నిర్వహిస్తున్నా రు. పోలవరం ముంపునకు గురైన కార్యాలయాలను తరలించినా... కొత్త భవనాలు ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించలేదు. దేవీ పట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల ముంపునకు గురైంది. దీనిని ఇందుకూరుపేటలోని జెడ్పీ పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు.
సొంత భవనాలు నిర్మించాలి
ఇందుకూరుపేటలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలి. కొన్ని కార్యాలయాలను అరకొర వసతుల మధ్య నిర్వహిస్తున్నారు.పనులు కోసం కార్యాలయానికి వెళ్లిన వారు కూర్చునేందుకు కూడా సరైన వసతులు లేవు. సొంత భవనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
– కుంజం మురళీ, ఎంపీపీ దేవీపట్నం
అరకొర వసతులతో ఉద్యోగులకు ఇక్కట్లు

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు