
2,086 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: జిల్లాలో ఎంపిక చేసిన 2,086 గ్రామాల్లో ప్రతి ఇంటి లోపల, బయట దోమల నివారణ మందును పిచికారీ చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌కు సమీపంలోని కుమ్మరిపుట్టులో మంగళవారం దోమల నివారణ మందు తొలివిడత పిచికారీ పనులను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు గృహాలను సందర్శించారు. ప్రతి ఇంటి లోపల, బయట మందును పిచికారీ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 2,086 గ్రామాల్లో దోమల నివారణ మందును పిచికారీ చేస్తున్నామన్నారు. మొదటి విడత పిచికారీ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని, రెండవ విడతను జులై 1వ తేదీ నుంచి ప్రారంభించాలన్నారు. తొలిరోజు 33 గ్రామాల్లో పిచికారీ ప్రారంభించగా 21 గ్రామాల్లో పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా,డీఎంవో తులసీ పాల్గొన్నారు.
మన మిత్రపై ప్రజలకు అవగాహన కల్పించాలి
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వాట్సప్ గవర్నెన్స్(మన మిత్ర)పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు.మంగళవారం సాయంత్రం ఆయన జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధిపై వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమిత్ర నంబర్ 9552300009ను మొబైల్‌లో సేవ్ చేసుకుని హాయ్ అని పెట్టడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 161 సేవలను ఇంట్లో ఉండే పొందవచ్చన్నారు.ఈయాప్‌పై సచివాలయాల సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రతి మూడవ శనివారం జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఇ–వేస్టేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 7,661 మంది విభిన్న ప్రతిభావంతులు సదరం శిబిరాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పీఎం సూర్యఘర్‌పైన విస్తృత ప్రచారం చేయాలన్నారు. సీపీవో పట్నాయక్,ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్,జీడబ్ల్యూఎస్ నోడల్ అధికారి పి.వి.ఎస్.కుమార్,ఎంపీడీవోలు పాల్గొన్నారు.