
ఫీజు చెల్లించలేదని పరీక్షలకు నిరాకరణ
● 40 మంది విద్యార్థులను అడ్డుకున్న ప్రిన్సిపాల్
● ముంచంగిపుట్టు ప్రైవేట్ స్కూల్‌లో ఘటన
● విచారణ జరిపించి, హెచ్చరించిన
ఎంఈవో
● గురువారం పరీక్ష రాయించేందుకు
అంగీకారం
● అమ్మఒడి లేకపోవడం వల్లే
ఇబ్బందులంటున్న తల్లిదండ్రులు
ముంచంగిపుట్టు: పాఠశాల ఫీజు చెల్లించలేదన్న కారణంతో 40 మంది విద్యార్థులు పరీక్ష రాయకుండా ప్రిన్సిపాల్ అడ్డుకున్నారు. దీంతో ఆ చిన్నారులు చిన్నబుచ్చుకుని ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు తెలియజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నేతాజీ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూల్‌లో బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల ఫీజును పూర్తిగా చెల్లించ లేదని, అందువల్ల ఎల్‌కేజీ నుంచి 6వ తరగతి వరకు తరగతి వరకు మొత్తం 40మంది విద్యార్థులతో ఇంగ్లిష్ పరీక్ష రాయించవద్దని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ విజయదాసు పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. దీంతో తోటి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే 40మంది విద్యార్థులు మాత్రం పరీక్షలు రాకుండా నిరీక్షించి,మధ్యాహ్నం ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపారు. ఫీజు చెల్లించేందుకు కొంత సమయం కావాలని, ముందుగా పిల్లలతో పరీక్షలు రాయించాలని తల్లిదండ్రులు ఫోన్‌లో కోరినా ప్రిన్సిపాల్ నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వారు ఎంఈవో కె.కృష్ణమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎంఈవో సీఆర్‌పీలు అనిల్,సురేష్,గౌరిశంకర్,హరిలతో కలిసి విచారణ జరిపారు. విద్యార్థులతో పరీక్షలు రాయించకపోవడంతో ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు.ఫీజుల వ్యవహారం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలని,విద్యార్థులతో పరీక్షలు రాయించకుండా చేస్తే సహించేది లేదని,శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దిగివచ్చిన ప్రిన్సిపాల్ తన తప్పును అంగీకరించి, ఆ 40 మందితో గురువారం పరీక్ష రాయించేందుకు అంగీకరించారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం నగదు ఠంచన్‌గా జమ అవడంతో ఫీజుల చెల్లింపులో ఇబ్బందులుండేవి కావని పలువురు తల్లిదండ్రులు తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో ఫీజులు చెల్లించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.