
ఈదురుగాలుల బీభత్సం
● పాడేరును కుదిపేసిన భారీ వర్షం
● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు,
భారీ వృక్షాలు
● జిల్లాలో పలుచోట్ల స్తంభించిన జనజీవనం
● విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
పాడేరు: జిల్లా అంతటా శుక్రవారం కుంభవృష్టి కురిసింది. ఈదురుగాలుల బీభత్సానికి భారీ నష్టం జరిగింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాడేరు పరిసర ప్రాంతాల్లో ఉదయం ఎండ చుర్రుమనిపించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. వెనువెంటనే భారీ వర్షం కురిసింది. గాలులకు పట్టణంలో తలారిసింగి వద్ద భారీ వృక్షం నేలమట్టమైంది. పాడేరు–చోడవరం ప్రధాన రహదారి సాయిబాబా ఆలయం సమీపంలో మరో భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోయింది. దీంతో అక్కడ నిలిపి ఉన్న స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. భారీ వృక్షం విద్యుత్ స్తంభాలు, తీగలపై పడింది. పాడేరు–జి.మాడుగుల ప్రధాన రహదారిపై డి.గొందూరు సమీపంలో భారీ మామిడి చెట్టు నేలపై కూలిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్‌ఆండ్‌బీ అధికారులు, స్థానికులు కలిసి చెట్లను తొలగించడంతో వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి. జిల్లాలో చాలాచోట్ల రాత్రి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీకు అంతరాయం ఏర్పడింది. దీంతో సోంపేట, పాడేరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు. శుక్రవారంనాటి వర్షాల వల్ల మామిడి, జీడి పంటలకు నష్టం వాటిల్లింది. రహదారులను వర్షపు నీరు ముంచెత్తింది. డుంబ్రిగుడలోని పోతంగి పంచాయతీ చంపాపట్టి గ్రామంలో ఈదురుగాలులకు పాఠశాల పైకప్పు ఎగిరిపోయింది. కొయ్యూరు మండలంలోని నడింపాలెం రహదారికి అడ్డంగా భారీ వృక్షం పడిపోయింది. దీంతో నడింపాలెం–పెదమాకవరం రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. గూడెం కొత్తవీధి రంపుల ప్రాంతంలో వడగళ్ల వాన కురిసింది.

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం