
ముక్కలు
రెక్కలు..
గణనీయంగా పడిపోయిన వైజాగ్ ఎయిర్‌పోర్ట్ వృద్ధి రేటు
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తును కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. గత ప్రభుత్వం చూపించిన శ్రద్ధతో ఎయిర్‌పోర్టు కొత్త రెక్కలు తొడుక్కుంది. నవ్య రూపం సంతరించుకుని అంతర్జాతీయ సర్వీసులను ఆకర్షించింది. కూటమి ప్రభుత్వం దీనికి రివర్స్‌లో విమానం రెక్కలు విరిచేసింది. దీంతో ఎయిర్‌పోర్టు వృద్ధి రేటులో తిరోగమనం దిశగా పయనిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం : ఏడాది క్రితంతో పోలిస్తే విశాఖ విమానాశ్రయంలో విమాన సర్వీసులు, ప్రయాణికుల వృద్ధి క్రమంగా క్షీణిస్తోంది. కోవిడ్ తర్వాత మొదటిసారిగా ప్రయాణికుల రాకపోకల వృద్ధి రేటు 20 శాతం దిగువకు పడిపోవడమే దీనికి నిదర్శనం. గతంలో కనీసం 50 నుంచి 100 శాతానికి పైగా వృద్ధి నమోదయ్యేది. కానీ ఈ ఏడాది మార్చిలో కేవలం 17 శాతానికే పరిమితమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేతకానితనం వల్ల ప్రయాణికుల రాకపోకల వృద్ధి రికార్డు స్థాయిలో తగ్గిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన వారైనా.. విమాన సర్వీసులు రద్దవుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని సర్వీసులు ఇతర ప్రాంతాలకు తరలించేయడం.. కొత్త సర్వీసులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.
మార్చిలో 17 శాతం వృద్ధి మాత్రమే.!
ప్రతి నెలా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్యను గణిస్తుంటారు. గతేడాది అదే నెలలో జరిగిన రాకపోకలతో పోల్చి వృద్ధి రేటు నమోదు చేస్తారు. ఈ వృద్ధి రేటు ఆధారంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తే ఎయిర్‌లైన్స్ సంస్థలు.. కొత్త సర్వీసులు నడిపేందుకు పోటీ పడుతుంటాయి. 2024 నవంబర్ వరకూ వైజాగ్ ఎయిర్‌పోర్టు గణనీయంగా వృద్ధి నమోదు చేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో 80 నుంచి 100 శాతం వరకూ, అంతర్జాతీయ సర్వీసుల్లో 90 నుంచి 150 శాతం వరకూ వృద్ధి కనిపించింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం విశాఖను విస్మరించిందో అప్పటి నుంచి సర్వీసులు తగ్గిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల వృద్ధి కూడా దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది ప్రయాణికులు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల్లో ప్రయాణించారు. 2024 మార్చిలో 2,17,243 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల సంఖ్య అంతగా పెరగకపోవడంతో వృద్ధి కేవలం 17.8 శాతం మాత్రమే నమోదైంది. గత ఐదేళ్ల కాలంలో కోవిడ్ మినహాయిస్తే.. ఇదే అత్యల్పం కావడం దురదృష్టకరం.
ఈ ఏడాది మార్చిలో
2,55,835 మంది రాకపోకలు
గతేడాది మార్చిలో
2,17,243 మంది ప్రయాణం
గత మార్చితో పోలిస్తే
కేవలం 17.8 శాతం మాత్రమే వృద్ధి
కూటమి సర్కారు నిర్వాకంతో
పలు విమాన సర్వీసుల రద్దు
పట్టించుకోని కేంద్ర మంత్రి
రామ్మోహన్‌నాయుడు
ఏప్రిల్ నెలలో మరింత
దిగజారనున్న వృద్ధి రేటు
వచ్చిన విమానాలు వచ్చినట్లే మాయం
మార్చిలో 20 శాతం దిగువన నమోదైతే.. ఏప్రిల్‌లో మరింత దిగువకు పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో విజయవాడ సర్వీసులతో పాటు మరికొన్ని సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఇటీవల దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా కూటమి సర్కారు అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. అదే నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయింది. ఇటీవలే బ్యాంకాక్, కౌలాలంపూర్ విమాన సర్వీసులు కూడా నిలిపేస్తున్నామని ప్రకటించాయి. విజయవాడ సర్వీసు ఆగిపోయింది. మిగిలిన డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో వైజాగ్ వచ్చేందుకు ఎయిర్‌లైన్స్ ఆసక్తి చూపిస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం రాకుండా మోకాలడ్డుతోంది. ఇలాగే కొనసాగితే వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి కొత్త సర్వీసులు వచ్చేందుకు అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోతాయని ప్రజలు, అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముక్కలు

ముక్కలు